Japan: అక్టోబర్‌లో ఎన్నికైన జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబాని ఓ భయం వెంటాడుతోంది. జపాన్ ప్రధాని అధికార నివాసంలో ‘‘దెయ్యాలు’’ ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఆ ఇంటికి వెళ్లేందుకు జంకుతున్నారు. నిజానికి ఈ భవనం 1929లో నిర్మించబడింది. 5183 చదరపు మీటర్ల రాతి, ఇటుకతో నిర్మించిన రెండు అంతస్తులు భవనం ఆర్ట్ డెకో డిజైన్‌తో నిర్మించారు. ఇది 20 శతాబ్ధపు ప్రారంభంలో జపాన్ ఆధునికవాదానికి మారడాన్ని సూచిస్తుంది. ఈ నిర్మాణం అమెరికన్ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ రూపొందించిన ఇంపీరియర్ హోటల్ నిర్మాణం నుంచి ప్రేరణ పొందింది. 1923లో పూర్తయిన ఇంపీరియల్ హోటల్, టోక్యోలో చాలా వరకు ధ్వంసమైన గ్రేట్ కాంటో భూకంపాన్ని తట్టుకుని నిలబడింది.
Read Also: Srinivasa Rao: ప్రభుత్వం మారి 6 నెలలు గడిచినా.. విధానాలు మాత్రం మారలేదు..!
భయానికి కారణాలు ఏంటి..?
ఈ భవనం జపనీస్ రాజకీయ చరిత్రలో అనేక గందరగోళాలకు వేదికగా నిలిచింది. 1932లో తిరుగుబాటులో అప్పటి ప్రధాని సుయోషి ఇనుకై, యంగ్ నేవీ అధికారులతో ఈ భవనంలోనే హత్య చేయబడ్డాడు. ఈ ఘటన తర్వాత జరిగిన నాలుగేళ్ల తర్వాత మరోసారి సైనిక తిరుగుబాటు జరుగింది. ఈ సమయంలో ఇదే భవనంలో ఐదుగురిని కాల్చి చంపారు. అయితే, అప్పటి ప్రధాని కీసుకే ఒకాడా ఒక గదిలో దాక్కుని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఇలా దశాబ్ధాల దాడుల తర్వాత, 2005లో ఈ భవనాన్ని పునర్నిర్మించారు. జపనీస్ ప్రభుత్వం 8.6 బిలియన్ యెన్‌లను ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దింది. 2005 నుంచి ఈ భవనం ప్రధాని నివాసంగా ఉంది. అయితే, ఈ భవనం ‘‘హాంటెడ్’ హౌజ్‌గా పేరు తెచ్చుకుంది. దెయ్యాల కథలతో ముడిపడి ఉంది. దీనికి కారణం ఆ భవనానికి ఉన్న నెత్తుటి చరిత్రనే.
మాజీ ప్రధాని సుటోము హటా భార్య యుసుకో హటా 1996లో తనకు ఈ నివాసంలో ఎదురైన వింత అనుభవాలను చెప్పింది. ఇది ఈ భవనంపై మరిన్ని పుకార్లకు కారణమైంది. ఈ భవనంలో తాను విచిత్రమైన, అదృశ్య ఉనికిని అనుభవించినట్లు చెప్పింది. రాత్రి సమయంలో తోటలో సైనిక అధికారుల దృశ్యాలు కన్పించాయని చెప్పింది.
మరో మాజీ ప్రధాని యోషిరో మోరీ కూడా తాను ఈ నివాసంలో దెయ్యాలను చూశానని షింజో అబేతో చెప్పినట్లు సమాచారం. 2013లో షింజో అబే రెండోసారి ప్రధానిగా గెలిచిన తర్వాత ఈ నివాసంలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ భవనం పునర్నిర్మాణం కాకముందే, షింటో పూజారి చేత భూతవైద్యం నిర్వహించారని, ఎదైనా ఆత్మలు ఉంటే వాటిని తొలగించడం జరిగింది.
2012 నుండి 2020 వరకు తన రెండవ టర్మ్ సమయంలో జపాన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే తిరిగి భవనంలోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. దీనికి బదులుగా ఆయన టోక్యోలని షిబుయా జిల్లాలోని తన ప్రైవేట్ ఇంటిలో నివసించారు. అబే వారసుడు యోషిహిడే సుగా కూడా నివాసంలో నివసించడానికి ఇష్టపడలేదు. డిసెంబర్ 2021లో ప్రధానమంత్రి అయిన ఫుమియో కిషిడా మాత్రం ఈ భవనంలో నివాసం ఉన్నారు. తాను రాత్రివేళల్లో చాలా బాగా నిద్రపోయానని దెయ్యాల ఊహాగానాలను కొట్టిపారేశారు.