Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం విషాదాన్ని నింపింది. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని అనుకున్న అక్కడి ప్రజలకు కన్నీటిని మిగిల్చింది. దేశంలోని వాయువ్య ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. కేవలం ఒకే రోజులో 150కి పైగా భూకంపాలు జపాన్ దేశాన్ని తాకాయి.
ఏం జరిగింది.?
జవవరి 1, 2024న జపాన్ వాయువ్య తీరంలోని నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు 60కి పైగా మరణాలు సంభవించాయి. సహాయక చర్యలకు సమయం మించిపోతుండటంతో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం కనిపిస్తోంది. 2011లో వచ్చిన భూకంపం, సునామీ విధ్వంసాన్ని మరోసారి తాజాగా సంభవించిన భూకంపం గుర్తు చేసింది.
జపాన్‌లో ఎక్కువ భూకంపాలు ఎందుకు.?
జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఈ దేశం ఉంది అత్యంత క్రియాశీలకమైన భూకంప ప్రదేశంలో. భూ అంతర్భాగంలో లోపాలు జపాన్ పాలిటశాపంగా మారాయి. ఇక తాజాగా భూకంపం సంభవించిన నోటో ద్వీపకల్పంలోని భూ అంతర్భాగంలో టెక్లానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ‘రివర్స్-టైప్ ఫాల్ట్ మెకానిజం’ అనే ప్రక్రియ జరిగి, భూ అంతర్భాగంలో ఒకదానిపై పలకలు ఒత్తిడిని పెంచుకుంటుండటంతో భూకంపాలు ఏర్పడుతున్నాయి. 2020-23లో ఇక్కడే 14,000 కంటే ఎక్కువ చిన్న భూకంపాలు వచ్చాయి. గతేడాది ఈ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
మరోవైపు జపాన్ విశాలమైన పసిఫిక్ మహా సముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనే జోన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు, టెక్లానిక్ ప్లేట్ల కార్యకలాపాలకు నిలయం. ఒక్క జపాన్ మాత్రమే కాదు, ఇండోనేషియా, వియత్నాం, టోంగో ఐలాండ్స్ వంటి దేశాలు ఈ రింగ్ఆఫ్ ఫైర్ జోన్‌లోనే ఉన్నాయి.
భారీ భూకంపాలు, వేలల్లో మరణాలు:
2011లో వచ్చిన గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. దీని వల్ల సునామీ ఏర్పడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 20,000 మంది చనిపోగా, 2500 మంది తప్పిపోయారు. 1,20,000 భవనాలు కూలిపోయాయి. ఫుకుషిమా అటామిక్ ఎలక్ట్రిక్ ప్లాంట్ దెబ్బతిని, అణు విపత్తుకు దారి తీసింది. అంతకుముందు కోబ్ భూకంపం వల్ల 6000 మంది, 2016లో కుమామోటో భూకంపం వల్ల 200 మంది, 1923 టోక్యో భూకంపంలో 1,00,000 మంది మరణించారు.
అయితే జపాన్ తీసుకుంటున్న భూకంప ముందస్తు హెచ్చరికలు ప్రజలు ఎక్కువ మంది చనిపోకుండా కాపాడుతోంది. అక్కడి నిర్మాణాలు కూడా భూకంపాలను తట్టుకునే విధంగా డిజైన్ చేయడం వల్ల ప్రజల మరణాల సంఖ్య తక్కువ.