NTV Telugu Site icon

Sheikh Hasina: హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ముందే హెచ్చరించిన భారత్!

Wakeruzzaman

Wakeruzzaman

కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్‌-ఉజ్‌-జమాన్‌ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది. ఆందోళనలు, నిరసనలను కట్టడి చేయాల్సిన సైన్యాధిపతి.. వెనకుండి ఉద్యమాన్ని ఎగదోసినట్లుగా సమాచారం. ఫలితంగా షేక్ హసీనా.. దేశం విడిచి వెళ్లిపోగానే ఆర్మీ చీఫ్ జమాన్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. జమాన్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

ఎవరీ జమాన్?
సోమవారం ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో సైన్యం హసీనాకు 45 నిమిషాల సమయాన్ని ఇచ్చింది. దీంతో ఆమె పదవి నుంచి దిగిపోయి దేశాన్ని విడిచి పారిపోయారు. అనంతరం హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రణాళిక బద్ధంగా హసీనాపై కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జమాన్‌ ఈ ఏడాది జూన్‌ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. అతడి గురించి హసీనాను భారత్‌ ఏడాది ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. జమాన్‌ చైనా అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా ఉండాలని భారత జాతీయ భద్రతా మండలి అధికారులు హసీనాను అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గుచూపింది.

జమాన్‌ నాలుగు దశాబ్దాల పాటు మిలిటరీలో ఉన్నారు. డిఫెన్స్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ విభాగంలో ప్రిన్సిపల్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించారు. ఆర్మీని ఆధునికీకరించడంలో కీలక పాత్ర పోషించిన అతడి సేవలను గుర్తించి ఈ ఏడాది జూన్‌లో మూడేళ్ల పదవీకాలానికి గానూ సైన్యాధిపతిగా హసీనా నియమించారు. అయితే బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హసీనాను గద్దెదింపి పాలనా పగ్గాలు అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్‌ రెహమాన్‌ కుమార్తెను జమాన్‌ వివాహం చేసుకున్నారు. షేక్‌ హసీనాకు ముస్తఫిజుర్‌ రెహమాన్‌ వరుసకు మామయ్య అవుతారు. జమాన్‌ బంధువు కూడా కావడంతో అతడి వైపే హసీనా మొగ్గు చూపించారు. కానీ చివరికి అతడే.. హసీనాను పదవీచ్యుతురాలను చేశాడు.