Whittier Town In Alaska Where Everyone Lives In A Single Building: సాధారణంగా ఒక ఊరంటే ఎలా ఉంటుంది..? కొన్ని ఇళ్లు, దుకాణాలు, పిల్లలు చదువుకోవడానికి స్కూలు, ఒక పోలీస్ స్టేషన్‌తో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. కానీ.. ఒక ఊరు మాత్రం అందుకు భిన్నంగా చాలా విచిత్రంగా ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఇళ్లు, దుకాణాలు, పోలీస్ స్టేషన్లు ఉండవు. అన్నీ ఒకే చోటే ఉంటాయి. అది కూడా ఒకే ఒక్క భవనంలో ఉంటాయి. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇది అమెరికాలోని అలస్కాలో ఉంది. ఆ ఊరు పేరు విట్టియర్.
ఈ విట్టియర్ అనే ఊరు.. అలాస్కాలోని అంకోరేజ్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరులో మొత్తంలో 200 మంది జనాభా ఉండగా, అందులో 180 మంది ‘బిగిచ్ టవర్స్’ అనే 14 అంతస్తుల భవనంలోనే నివాసం ఉంటారు. ఒకప్పుడు ఈ భవనం ఆర్మీకి చెందింది. దాని చుట్టుపక్కల కొన్ని ఇళ్లు ఉన్నప్పటికీ.. వాటిల్లో జనాలు ఉండరు. కేవలం 20 మంది మాత్రమే ఆయా ఇళ్లల్లో ఉంటారు. మిగిలిన వారంతా ఆ భవనంలోనే ఉంటారు. అందులోనే చిన్న షాపింగ్ మాల్, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి ఉన్నాయి. అంతేకాదండోయ్.. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే టూరిస్టులకు కూడా ఆ భవనంలోనే బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అయితే.. స్కూలు మాత్రం ఆ భవనంలో లేదు. అది బయట ఉంటుంది. ఆ స్కూల్‌కి వెళ్లడానికి ఒక సొరంగ మార్గం ఉంది. దాని ద్వారానే వీళ్లు స్కూల్‌కి వెళ్తారు.
అయినా.. చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా, జనాలెందుకు అందులో ఉండటం లేదు? ఈ ఒక్క భవనంలోనే అన్ని సౌకర్యాలు ఎందుకు ఉన్నాయి? అందుకు కారణం.. ఆ ప్రాంతం అంతా నిత్యం మంచుతో కప్పబడి ఉండటమే! ప్రజలందరికీ వేర్వేరుగా వేడి సౌకర్యాలు కల్పించడం, రక్షణ అందించడం సమస్య అని.. ప్రభుత్వం అక్కడుంటే జనాలందరినీ ఒకే భవనంలోని మార్పించింది. ఇటీవల ఈ ఊరు బాగా ప్రాచుర్యంలోకి రావడం వల్ల.. పర్యాటకుల సంఖ్య పెరిగింది. వారి కోసం ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మొదలయ్యాయి. అయితే.. ఈ ఊరుకి చేరుకోవాలంటే, అంత సులువు కాదు. కొండల మధ్య ఘాట్ రోడ్లు, టన్నెళ్ల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే, ఈ ప్రయాణం కూడా అత్యంత ప్రమాదకరమైంది.