Site icon NTV Telugu

Trump: పాక్ ఆర్మీ చీఫ్‌కు ట్రంప్ ప్రత్యేక విందు.. ఇద్దరి భేటీపై వైట్‌హౌస్‌ ఏం తేల్చిందంటే..!

Trump

Trump

ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రం అని కూడా తెలుసు. అంతేకాకుండా చైనాకు పాకిస్థాన్ మిత్ర దేశం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక ఏదో మతలాబు ఉందంటూ ప్రపంచ నాయకులు భావిస్తున్నారు. ఈ సమావేశం వెనుక ఉన్న రహస్యమేంటి? అనేది నేతలు ఆలోచనలో పడ్డారు. ఇక బుధవారం డోనాల్డ్ ట్రంప్-ఆసిమ్ మునీర్ మధ్య జరిగిన సమావేశం రహస్య చర్చ అని వైట్ హౌస్ తెలిపింది. ఇక సమావేశానికి సంబంధించిన ఫొటోలు గానీ.. వీడియోలు గానీ బయటకు రాలేదు. దీంతో ప్రపంచ మీడియా కూడా నిశితంగా పరిశీలిస్తోంది.

ఇది కూడా చదవండి: YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. సర్వత్రా ఆసక్తి!

ఇరాన్‌కు చైనా మిత్ర దేశం. ఇటీవల కాలంలో ఖమేనీ పాలనకు చైనా మద్దతు వ్యక్తం చేసింది. ఇక పాకిస్థాన్‌ను కూడా మిత్ర దేశంగా భావిస్తుంది. ఇక ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌ను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇరాన్‌కు ఏదైనా జరిగితే ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తామంటూ పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో వైట్‌హౌస్‌లో ట్రంప్ ఎందుకు భేటీకావల్సి వచ్చిందని చైనాతో పాటు ఆసియా దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ భేటీ వెనుక ఏదో మర్మం ఉందంటూ భావిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Insta influencer: బిల్డర్‌ను హనీట్రాప్ చేసిన ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్.. కోట్ల రూపాయల డిమాండ్.. చివరకు

ఇక గతంలో కూడా పాకిస్థాన్ సైనిక నియంతలు జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ కూడా అమెరికా అధ్యక్షులను కలిసి వారితో భోజనం చేసిన సందర్భాలున్నాయి. జనరల్ జియా ఉల్ హక్ పాలనలో ఆప్ఘనిస్థాన్‌పై సోవియట్ దండయాత్రను ఎదుర్కోవడానికి అమెరికాకు పాకిస్థాన్ సాయం చేసింది. అప్పుడు మిత్రదేశంగా మారింది. అలాగే పర్వేజ్ ముషారఫ్ పాలనలో కూడా ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని నిరోధానికి అమెరికా ప్రయత్నాలకు సహాయం చేసింది.

ఇప్పుడు తాజాగా ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సరిహద్దు దేశమైన పాకిస్థాన్ అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సాయం కోరేందుకు ఆసిమ్ మునీర్‌ను అమెరికాకు పిలిపించి.. ప్రత్యేక విందు ద్వారా ట్రంప్ సాయం కోరి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌కు పాకిస్థాన్ మధ్య 1,000 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమాన వాహక నౌకలు యూఎస్ఎస్ కార్ల్ విన్సన్, యూఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమాన్ అరేబియా సముద్రంలో మోహరించాయి. బీ -2 స్టీల్త్ బాంబర్ల సముదాయం డియెగో గార్సియాలోని హిందూ మహాసముద్ర వైమానిక దళ స్థావరంలో వరుసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్థాన్ అవసరం వచ్చింది. అందుకే ఇద్దరి మధ్య భేటీ జరిగినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే ట్రంప్-ఆసిమ్ మునీర్ భేటీపై వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ ఒక ప్రకటన విడుదల చేసింది. వీరిద్దరు భేటీ కావడానికి ప్రధాన కారణం గత నెలలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని నివారించినందుకు ట్రంప్‌నకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆసిమ్ మునీర్ డిమాండ్ చేశారని.. ఈ నేపథ్యంలోనే మునీర్‌కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశారు. తాను పాకిస్థాన్‌ను ప్రేమిస్తున్నానని.. మోడీ కూడా అద్భుతమైన వాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలను సమతుల్యం చేస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అసలు వీరిద్దరి భేటీ వెనుక ఏముందో.. భవిష్యత్ పరిణామాలను బట్టి చూడాలి.

Exit mobile version