Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ మెలానియా ట్రంప్ గైర్హాజరుపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో ట్రంప్ సన్నిహిత సలహాదారు నతాలీ హార్ప్ అధ్యక్షుడితో తరచూ కనిపిస్తుండటాన్ని తన కథనంలో ప్రస్తావించింది. ‘ది ఇండిపెండెంట్’ న్యూయార్క్ ప్రతినిధి బ్రెండన్ రాసియస్ తన కథనంలో “మెలానియా ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు. మెలానియాను చివరిసారిగా 2026 జూలై 19న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా బహిరంగంగా చూసినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. ఆ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న పలు కీలక కార్యక్రమాల్లో ఆమె కనిపించలేదని తెలిపింది.
జూలై 19 తర్వాత పబ్లిక్ ఈవెంట్లకు దూరం
అమెరికా ఫస్ట్ లేడీ సాధారణంగా అధ్యక్షుడితో కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అయితే మెలానియా విషయంలో మాత్రం బహిరంగ కార్యక్రమాల్లో ఆమె హాజరు తక్కువగా ఉండటం కొత్తేమీ కాదని ‘ది ఇండిపెండెంట్’ పేర్కొంది. 2026 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మెలానియా సుమారు 34 బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నివేదిక తెలిపింది. అంటే సగటున ఆరు రోజులకు ఒకసారి ఆమె పబ్లిక్‌గా కనిపించినట్లు పేర్కొంది. మెలానియా తన సమయాన్ని ఫ్లోరిడా, న్యూయార్క్ మధ్య గడుపుతున్నట్లు సమాచారం. ఆమె కుమారుడు బ్యారన్ ట్రంప్ న్యూయార్క్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి గడిపేందుకు మెలానియా ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల ఆమె బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి వ్యక్తిగత, కుటుంబ కారణాలు కూడా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ వెంట నిత్యం కనిపిస్తున్న నతాలీ హార్ప్ ఎవరు?
మెలానియా గైర్హాజరు చర్చకు దారితీస్తున్న సమయంలో ట్రంప్‌తో తరచూ కనిపిస్తున్న మరో మహిళా అధికారి నతాలీ హార్ప్ పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. 35 ఏళ్ల హార్ప్ ట్రంప్ సన్నిహిత సలహాదారుల్లో ఒకరిగా ఉన్నారు. అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలు, పర్యటనలు, పలు బహిరంగ కార్యక్రమాల్లో ఆమె ట్రంప్ వెంట కనిపిస్తున్నారు. ట్రంప్ చైనాలో చేపట్టిన అధికారిక పర్యటనలోనూ హార్ప్ ఆయనతో కలిసి వెళ్లినట్లు కథనం పేర్కొంది. అయితే ఆ పర్యటనకు మెలానియా హాజరుకాలేదు. ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్టులు మ్యాగీ హేబర్‌మాన్, జోనాథన్ స్వాన్‌లను ఉటంకిస్తూ.. నతాలీ హార్ప్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఒకరని ‘ది ఇండిపెండెంట్’ తెలిపింది. ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ ఖాతాను నిర్వహించడంలోనూ హార్ప్ సహకరిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ట్రంప్ ఆమెను అత్యంత విశ్వసనీయమైన, విధేయమైన సహాయకురాలిగా భావిస్తారని ‘ది ఇండిపెండెంట్’ కథనం తెలిపింది. మొత్తంగా మెలానియా ట్రంప్ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అదే సమయంలో నతాలీ హార్ప్ అధ్యక్షుడితో తరచూ కనిపిస్తుండటం అమెరికా రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. అయితే మెలానియా గైర్హాజరుపై ఎలాంటి అసాధారణ కారణాన్ని ఈ నివేదిక నిర్ధారించలేదు.

