ఇప్పుడున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌దే పైచేయి. సులువుగా చాటింగ్ చేయడానికి వీలుండటమే కాదు, ఎన్నో అధునాతనమైన ఫీచర్స్‌తో ఇది ఊరిస్తూ వస్తోంది. కొత్త కొత్త అప్డేట్స్‌తో మాంచి కిక్ ఇస్తోంది. అందుకే, యువత ఈ యాప్‌కి బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్‌ని వాట్సాప్ తీసుకొస్తోంది. రీసెంట్‌గానే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. లేటెస్ట్‌గా మరో క్రేజీ అప్డేట్‌ని రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతోంది.
చాలాకాలం క్రితమే ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే స్టేటస్ పెట్టుకునే ఫీచర్‌ని వాట్సాప్‌లో ప్రవేశపెట్టిన సంగతి విదితమే! ఈ స్టేటస్‌లో ఇప్పటివరకూ వీడియోలు, ఫోటోలు లేదా మనకి నచ్చని టెక్ట్స్ పెట్టుకోవడానికే వీలుంది. ఇప్పుడు వాట్సాప్ డెవలప్ టీమ్ ఈ స్టేటస్‌కి మరో కొత్త ఫీచర్‌ని జత చేయబోతోంది. ఈ ఫీచర్‌తో తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియో క్లిప్స్, అలాగే వాయిస్ నోట్స్‌ను స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం స్టేటస్ బార్‌ని క్లిక్ చేస్తే.. కెమెరా, టెక్స్ట్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇప్పుడు త్వరలోనే రాబోతున్న ఆడియో స్టేటస్ ఫీచర్‌తో, ఆ రెండు ఆప్షన్లకి అదనంగా మైక్ సింబల్ రానుంది. ఇంకా ఈ ఫీచర్ పరీక్షల దశలోనే ఉన్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.
దీంతోపాటు డెస్క్‌టాప్ యూజర్లకు కూడా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మనకు రోజుకి ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే.. మనం ముఖ్యమైన వాటినే చదివి, మిగతా వాటిని పక్కనపెట్టేస్తాం. వాటిని ఎప్పుడైనా చదవాలంటే, కాంటాక్ బార్‌ను కిందకు స్క్రోల్ చేయక తప్పదు. ఇకపై ఆ అవసరం లేకుండా.. అన్‌రీడ్ చాట్ ఫిల్డర్ అనే ఫీచర్‌ని వాట్సాప్ తీసుకొచ్చింది. కాంటాక్ట్ బార్ సెర్చ్ పక్కనే ఓ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే, చదవని మెసేజ్‌లు కనిపిస్తాయి.