ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం.. చాలా విషయాలు సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేస్తుంటాయి.. ఇక, లైక్‌లు, కామెంట్లు, షేరింగ్‌లు.. ఇలా అది తప్పా..? ఒప్పా..? అనే విషయంతో సంబంధం లేకుండా అలా వైరల్ చేసేవాళ్లు లేకపోలేదు.. అయితే.. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతోన్న సమయంలో.. ఎలాంటి సమస్యలు సృష్టించకుండా సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జాంబియా.. ఈ నెల 12వ తేదీన జాంబియాలో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచే ఓట్ల లెక్కింపు చేపట్టారు.. ఎన్నికలు ముగిసిన 72 గంటల్లో అక్కడ ఫలితాలను వెల్లడిస్తారు. అయితే, ఫలితాలు వెల్లడించే ఈ మూడు రోజుల పాటు.. అక్కడ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించింది ఎన్నికల కమిషన్.
ఎన్నికలు, కౌంటింగ్ సమయంలో ఎలాంటి తప్పుడు వార్తలకు ఆస్కారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్టోరల్ కమిషన్ ఆఫ్ జాంబియా(ఈసీజెడ్) తెలిపింది.. ఫలితాలు వెలువడే వరకు ఈ సోషల్ మీడియా సైట్లతో పాటు.. ఇంటర్నెట్‌పై కూడా ఆంక్షలు ఉంటాయని ఈసీ వెల్లడించింది. కాగా, జాంబియాలో జరిగిన ఎన్నికలు ముఖ్యంగా.. ప్రెసిడెంట్ ఎడ్గర్ లుంగు, హకైండే హిచిలెమా మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా చెబుతున్నారు.. మరోవైపు సోషల్ మీడియా సైట్లపై బ్యాన్ విధిస్తూ ఎలక్టోరల్ కమిషన్ ఆఫ్ జాంబియా తీసుకున్న నిర్ణయంపై స్పందించలేదు జాంబియా ప్రభుత్వం.