NTV Telugu Site icon

Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?

Hezbollah

Hezbollah

Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్‌పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్‌లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.

నస్రల్లా చనిపోవడానికి ముందు సెప్టెంబర్ 19న తన చివరి ప్రసంగాన్ని చేశారు. లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు పేలిన ఘటన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ పేజర్ల పేలుడులో 37 మంది మరణించాగా, 3000 మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఘోరమైన దాడిని ఖండించారు. ఇది ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసారు, ఇజ్రాయెల్ దురాక్రమణలకు “న్యాయమైన శిక్ష”ని విధిస్తామని అన్నారు. ఈ పేజర్ల దాడిని తమ సంస్థకు ‘‘అపూర్వమైన దెబ్బ’’గా అభివర్ణించాడు. దేవుడిపై విశ్వాసతంతో హిజ్బుల్లా ఈ సంక్షోభం నుంచి మళ్లీ తలెత్తుకుంటుందని చెప్పారు.

Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..

సెప్టెంబర్ 20 ఇజ్రాయిల్ బీరూట్‌పై మరో దాడి నిర్వహించి హిజ్బుల్లా యొక్క ఎలైట్ రద్వాన్ యూనిట్ కమాండర్ ఇబ్రహీం అకిల్‌తో పాటు మరో 12 మందిని హతమార్చింది. అకిల్ సంస్థలో సీనియర్ వ్యక్తి మరియు 1983లో బీరుట్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో అతని ప్రమేయం ఉంది. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. తమ పౌరులు ఉత్తర ప్రాంతానికి తిరిగి వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. లెబనాన్ దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించారు. ఆరు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.