తాలిబన్ల శకం ఆరంభం అయినప్పటి నుంచి పంజ్‌షీర్ ప్రావిన్స్ వారికి కొరకరాని కొయ్యగా మారింది. 1994 ప్రాంతంలో కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పటికీ పంజ్‌షీర్ మాత్రం వారికి దొరకలేదు. అప్పటి నుంచి అక్కడి స్థానిక సాయుధులు తాలిబన్లతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాగా, ఇప్పుడు కూడా తాలిబన్లతో పంజ్‌షీర్ సేనలు పోరాటం చేస్తున్నాయి. పంజ్‌షీర్ సేనలు 6 వేల వరకు ఉండగా, తాలిబన్ల సైన్యం అపారంగా ఉంది. పైగా వారివద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ వశం కావడంతో అమెరికా దళాలు వదిలి వెళ్లిన ఆయుధాలు తాలిబన్ల వశం అయ్యాయి. ఇప్పటికే తాలిబన్లు పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను చుట్టుముట్టారు. ఏ క్షణమైనా వారు విరుచుకుపడే అవకాశం ఉన్నది. అయితే, పంజ్‌షీర్ దళం అధిపతి మసూద్ అంతర్జాతీయ దేశాల మద్దతు కావాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మసూద్ విజ్ఞప్తిని వారు ఆలకిస్తారు అనుకోవడం పోరపాటే. పోరాటం చేసి పంజ్‌షీర్ మొత్తం రక్తపాతం అయ్యేకంటే, సంధి చేసుకొని లొంగిపోవడం ఉత్తమం అని మసూద్ అనుకుంటున్నట్టు సమాచారం. పంజ్‌షీర్ కూడా తాలిబన్ల వశమైతే ఇక ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల చేతిలోకి వెళ్లినట్టే అవుతుంది.