Site icon NTV Telugu

Benjamin Netanyahu: ఇరాన్ అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోం..

Israel

Israel

Benjamin Netanyahu: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్‌ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నెతన్యాహు చెప్పినట్లు యూఎస్ కు చెందిన పలు మీడియాల్లో కథనాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ టైంలో ఇరువురు నేతలు ఇరాన్‌పై ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు. ఇరాన్‌ చమురు స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తే ఇంధన ధరలు పెరిగిపోతాయని పలువురు విశ్లేషకులు తెలిపినట్లు సమాచారం. ఇది అమెరికా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. కావున ఇజ్రాయెల్‌ ప్రత్యామ్నాయం ఆలోచించాలని నెతన్యాహుకు జో బైడెన్‌ సూచించారు. ఆయన సూచనలతో ఇరాన్‌ చమురు స్థావరాలపై దాడులను ఇజ్రాయెల్ విరమించుకున్నట్లు సమాచారం.

Read Also: Group-1 Prelims: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..

అయితే, తాము అమెరికన్‌ ప్రభుత్వ మాటలను వింటాం.. కానీ, ఇజ్రాయెల్‌ దళాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. నెతన్యాహుకు యూఎస్‌ విజ్ఞప్తులు ఇజ్రాయెల్‌లోని ప్రజల డిమాండ్‌తో సమానమని ఆ దేశ ఇంటెలిజెన్స్‌ మాజీ డైరెక్టర్‌ తెలిపారు. అలాగే, అమెరికా ఆయుధాలతోనే ఇజ్రాయెల్‌ పోరాడుతుందని వెల్లడించారు. అయితే, ఈ అంశాలపై వైట్‌హౌస్‌ స్పందించలేదు.

Read Also: CSIR UGC NET Result 2024: NET జూన్ పరీక్ష ఫలితాల విడుదల.. ఫలితాలు చెక్ చేసుకున్నారా?

ఇక, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణలతో దాడి చేసింది. దాదాపు 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని బెంజమిన్ నెతాన్యహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఇరాన్‌కు చెందిన అణు, చమురు స్థావరాలను ధ్వంసం చేసేందుకు చర్చలు చేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇరాన్‌ అణు స్థావరాలపై కాకుండా ప్రత్యమ్నాయంగా దాడి చేయాలని బహిరంగంగానే ఇజ్రాయెల్‌కు సూచనలను చేయడంతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది.

Exit mobile version