NTV Telugu Site icon

Vivek Ramaswamy: చైనాను అడ్డుకోవాలంటే భారత్‌తో బంధం బలపరుచుకోవాల్సిందే.. రిపబ్లికన్ నేత వ్యాఖ్యలు..

Vivek Ramaswamy

Vivek Ramaswamy

Vivek Ramaswamy: చైనా గుత్తాధిపత్యం, సైనిక దూకుడు, విస్తరణవాదాన్ని అడ్డుకోవాలంటే భారతదేశం మాత్రమే సరైందని అమెరికాతో పాటు అన్ని యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారతదేశంతో చైనా వ్యతిరేక దేశాలు సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత, ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

తాను భారత్ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని చూస్తున్నానని ఆయన అన్నారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్య్రం పొందాలంటే భారత్, చిలీ, ఇజ్రాయిల్, బ్రెజిల్ వంటి దేశాలతో సంబంధాలను బలపరుచుకోవాలన్నారు. ఇందుకు తాను నాలుగు అంశాలతో ప్రణాళిక రూపొందించానని వెల్లడించారు. న్యూయార్క్ పోస్టు వివేక్ రామస్వామికి సంబంధించిన అభిప్రాయాలను ఓ కథనంలో పేర్కొంది. అమెరికా ఫార్మా రంగంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్, ఇజ్రాయిల్ తో సంబంధాలు విస్తరించాలని చెప్పారు.

Read Also: Justin Trudeau: 50 ఏళ్లలో అత్యంత చెత్త కెనడా ప్రధాని ట్రూడో.. ప్రజామద్దతు ప్రతిపక్ష నేతకే..

కంప్యూటర్ చిప్స్ తయారీలో, ఈవీ ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో కీలమైన లిథియం కోసం అమెరికా, చైనాపై ఎక్కువగా ఆధారపడుతోందని అన్నారు. దీనికి బదులుగా ఈ ఖనిజం కోసం భారత్, బ్రెజిల్, చిలీ దేశాలను ఆశ్రయించాలని అన్నారు. ఈవీ వాహనాలపై అమెరికా అందించే సబ్సిడీలు పరోక్షంగా చైనాకు లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఖనిజాలను భారత్, బ్రెజిల్, చిలీ నుంచి దిగుమతి చేసుకోవచ్చని సూచించారు. ఇక చిప్స్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి జపాన్, దక్షిణ కొరియా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని కోరారు.

భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో దూసుకుపోతున్నారు. కొన్నాళ్ల వరకు మూడో స్థానంలో ఉన్న రామస్వామి ఇప్పుడు రెండోస్థానికి చేరారు. రిపబ్లిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం పోరాడుతున్న వారిలో డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి వరసగా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. డోనాల్డ్ ట్రంపుకు 39 శాతం మద్దతు ఉండగా.. రామస్వామికి 13 శాతం మద్దతు ఉంది.