NTV Telugu Site icon

Hamas-Trump: శనివారం మ.12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదన్న ట్రంప్

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం విధించారు. ఒకవేళ విడుదల చేయకపోతే.. నరకం చూస్తారని హెచ్చరించారు. ట్రంప్ తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా స్పందిస్తూ.. తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.

ఇదే అంశంపై శుక్రవారం ట్రంప్ స్పందిస్తూ.. శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. బందీల విడుదలకు తాను విధించిన గడువు దగ్గర పడుతుందని గుర్తుచేశారు. ‘‘శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలియదు.. చాలా కఠినమైన వైఖరి తీసుకుంటాను. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో కచ్చితంగా తాను చెప్పలేను.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవల విడుదలైన బందీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.. ముందున్న చిత్రాలకు.. ఇప్పుడున్న వారి పరిస్థితి చూస్తుంటే కృశించిపోయినట్లు కనిపించారు. ఇది హృదయ విదారకంగా ఉంది.‌’’ అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోందని.. ఇలాగైతే బందీలను విడుదల చేయబోమని హమాస్ హెచ్చరించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని హెచ్చరించారు. లేదంటే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లు జోర్డాన్, ఈజిప్ట్‌లకు వెళ్లిపోవాలన్నారు. గాజాను పునర్ నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండించాయి. దీనిపై అరబ్ దేశాలు శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు గాజా పాలస్తీనీయులదేనని చైనా వ్యాఖ్యానించింది.

అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. ఏడాదికి పైగా హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేయడంతో గాజా పట్టణం సర్వనాశనం అయింది. అయితే ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా ఒప్పందం జరగడంతో కాల్పులకు విరామం దొరికింది. మరోసారి ఈ వివాదం ముదురుతోంది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. హమాస్ ఏం చేస్తుందోనన్న సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.