Site icon NTV Telugu

Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!

Trump1

Trump1

ఈ మధ్య పదే పదే ట్రంప్ మాట్లాడుతూ తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నారు. గత ఏడాదంతా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ యుద్ధం చేయగా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా వెళ్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. అనంతరం గ్రీన్‌లాండ్, కొలంబియా, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై కూడా ట్రంప్ గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా భారత్, చైనాపై కూడా ట్రంప్ ప్రత్యేక గురి పెట్టారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయొద్దని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. కానీ భారత్, చైనా మాత్రం రష్యా దగ్గర చమురు కొనుగోలు ఆపలేదు. ఈ క్రమంలో రెండు దేశాలను శిక్షించే బిల్లుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. బుధవారం జరిగిన ఉత్పాదక సమావేశం (Productive Meeting) తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షల బిల్లును ఆమోదించారని.. వచ్చే వారం ప్రారంభంలోనే దీనిపై ఓటింగ్ జరగవచ్చని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

రష్యా నుంచి ఉద్దేశ పూర్వకంగా చమురు కొనుగోలు చేసే దేశాలను శిక్షించేందుకే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. వచ్చే వారం బిల్లు ఆమోదం పొందితే మాత్రం భారతదేశం, చైనా, బ్రెజిల్ దేశాలపై భారీ ఎత్తున సుంకాలు పడే అవకాశం ఉంది. అంటే భారతదేశంపై ఏకంగా 500 శాతం వరకు సుంకం పెరగవచ్చు. ఇప్పటికే 50 శాతం సుంకం విధించడంతో అమెరికాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏకంగా 500 శాతం సుంకం విధిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిననున్నాయి.

ఈ కొత్త బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ స్పాన్సర్ రూపొందించారు. ఈ చట్టానికి తాజాగా ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. వచ్చే వారమే దీనిపై ఓటింగ్ జరగనుంది. ఒకవేళ బిల్లు పాస్ అయితే మాత్రం భారత్, చైనా, బ్రిజిల్‌పై భారీ స్థాయిలో సుంకాలు పడనున్నాయి.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం ఇవ్వలేదు. ఇటీవల శాంతి చర్చలు ఫలించినట్టే.. ఫలించి మళ్లీ స్తబ్దత నెలకొంది. ఇక ఈ క్రమంలోనే రష్యా దగ్గర భారత్, చైనా చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. తక్షణమే రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయాలని భారత్‌కు సూచించారు. కానీ ట్రంప్ హెచ్చరికలను భారత్ ఖాతర్ చేయలేదు. ఈ నేపథ్యంలో మాట వినని దేశాలను శిక్షించేందుకు బిల్లుకు తీసుకు వస్తున్నారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Exit mobile version