US-Iran Tension: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ కార్యక్రమం జరిగిన వెంటనే అమెరికా ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వం వ్యతిరేక నిరసనల్ని మత పాలకులు అణిచివేశారు. అయితే, దీనిని సాకుగా చూపుతూ యూఎస్ దాడులకు సిద్ధమవుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. USS అబ్రహాం లింకన్ నేతృత్వంలోని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ త్వరలోనే అరేబియన్ సముద్రం చేరనుంది. ఇందులో గైడెడ్ మిస్సైల్స్ డిస్ట్రాయర్స్, అటాక్ సబ్ మెరైన్స్ కూడా ఉన్నాయి. గతంలో దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ నౌకదళాన్ని ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ స్ట్రైక్ గ్రూప్ తమ ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేసి డార్క్ మోడ్‌లోకి వెళ్లింది. శత్రువులు ట్రాక్ చేయకుండా చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కూడా పశ్చిమాసియా వైపు వెళ్లాయి. గతంలో ఏప్రిల్ నెలలో ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్, మిస్సైల్ దాడులను ఎదుర్కొనేందుకు ఈ స్వ్కాడ్రన్ నే ఉపయోగించారు. ఫైటర్ జెట్లకు గాలిలోనే ఇంధనం నింపే KC-135 ఎయిరియల్ రీఫ్యూయలింగ్ విమానాలను, థాడ్, పేట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థలను ఇజ్రాయిల్ ఖతార్, ఇజ్రాయిల్‌లో మోహరించింది.
ఇరాన్ హింసనే కారణమా.? ఇతర కారణాలు ఉన్నాయా.?
ఇటీవల, ఇరాన్ వ్యాప్తంగా ఉవ్వెత్తున ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఎగిసిపడింది. ప్రజలంతా స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద నిరసనలు నిర్వహించారు. అయితే, వీటిని అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం జరిపిన హింసాకాండలో 3117 మంది మరణించారు. అయితే, వాస్తవ సంఖ్య 20 వేలకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు, ఇజ్రాయిల్ అమెరికాలే ఈ నిరసనల్ని రెచ్చగొడుతున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇరాన్ అణు కార్యక్రమమే అసలు కారణమని తెలుస్తోంది. జూన్ 2025లో అమెరికా దాడుల తర్వాత 400 కిలోల ఎన్రిచ్ యురేనియం కనిపించకుండా పోయిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది సుమారు 10 అణ్వాయుధాలకు సమానం. ఇరాన్ తన అణున కార్యక్రమాలను ప్రారంభిస్తే అమెరికా దాడి తప్పదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
ఇరాన్‌పై దాడి జరిగితే ఏర్పడే పరిణామాలు, ఇజ్రాయిల్ పాత్ర
విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం, ముందుగా పరిమిత దాడులతో మొదలై, ఆ తర్వాత మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దశలో ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా దాడులు చేయవచ్చని తెలుస్తోంది. అయితే, దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ పశ్చిమాసియాలోని యూఎస్ స్థావరాలపై దాడులు చేసే అవకాశం ఉంది. చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న, ప్రతీ రోజు 2 కోట్ల బ్యారెల్ల చమురు రవాణా జరుగుతున్న ‘‘హర్ముజ్ జలసంధి’’ని ఇరాన్ బ్లాక్ చేయవచ్చు. దీని వల్ల చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇదే సమయంలో, అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే, ఇజ్రాయిల్ కూడా అమెరికా దాడులకు మద్దతుగా నిలుస్తుంది. ఇలా జరిగితే ఇజ్రాయిల్‌ను ఇరాన్ టార్గెట్ చేస్తుంది.