US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!

  • యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి షాకింగ్ ఫలితాలు..
  • రిపబ్లికన్ పార్టీపై డెమోక్రాట్లు ఆధిక్యం సంపాదిస్తే ట్రంప్‌కు కష్టాలు..
  • ట్రంప్ అధికారాలపై ఆంక్షలు, అభిశంసన ముప్పు..
Trump

Trump

US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు చాలా చోట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు, డెమోక్రాట్లు సత్తా చాటుతున్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైతే ట్రంప్ అధ్యక్ష పదవికి ఎసరు పెట్టే అవకాశం ఉంది. అయితే, రాబోయే రెండేళ్లు మాత్రం ఆయనకు కష్టకాలంగా మారుతుంది. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు మెజారిటీ లభిస్తే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, అధికారుల జవాబుదారీతనం, అభిశంసన ప్రక్రియకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది.

డెమోక్రాట్ల ఆధిప్యతం పెరిగితే ఏం అవుతుంది.?

అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనెట్‌లోని మూడోంతుల సీట్లకు ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు మెజారిటీ లభిస్తే కీలక పార్లమెంటరీ కమిటీలపై వారి నియంత్రణ పెరుగుతుంది. దీంతో ట్రంప్ పరిపాలన తీసుకున్న నిర్ణయాలపై విచారణలు చేపట్టడం, ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నించడం మొదలవుతుంది. దీంతో ట్రంప్‌పై ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి ఒత్తిడి తీవ్రం అవుతుంది. కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోయినంత మాత్రాన అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారులు రద్దు కావు. ట్రంప్ తన పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసే అధికారాన్ని కొనసాగిస్తారు.

అభిశంసన ప్రక్రియకు అవకాశం..

డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తే ట్రంప్‌పై అభిశంసలన ప్రక్రియకు సంబంధించిన చర్చలు మొదలువుతాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించవచ్చు. దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుంది.అయితే, అభిశంసన ద్వారా ట్రంప్‌ను వెంటనే పదవి నుంచి తొలగించడం వీలు కాదు. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సెనెట్‌లో విచారణ జరుగుతుంది. అధ్యక్షుడు తప్పు చేస్తున్నాడని, ఆయనను తొలగించాలంటే నేట్‌లో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. అందువల్ల డెమోక్రాట్లు అభిశంసన ప్రక్రియను ప్రారంభించినా, ట్రంప్‌ను పదవి నుంచి తొలగించడం అంత సులభం కాదు.

ఇరాన్ యుద్ధం, ఎలాన్ మస్క్‌ కంపెనీలపై విచారణ..

ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న వేళ దీనిపై ట్రంప్ ప్రశ్నల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. డెమోక్రాట్లు యుద్ధం నిర్ణయాలు, సైనిక వ్యయం, రక్షణ బడ్జెట్‌పై ప్రశ్నల్ని లేవనెత్తే అవకాశం ఉంటుంది. యుద్ధ నిధులపై చర్చలు, వివాదాలు తలెత్తవచ్చు. అయినప్పటికీ రిపబ్లికన్లు ఓడిపోయినంత మాత్రాన యుద్ధానికి సంబంధించిన నిధులు ఆటోమేటిక్‌గా నిలిచిపోవు. విదేశాంగ విధానం, సైనిక చర్యలకు సంబంధించిన అధికారాలు ట్రంప్ వద్దే ఉంటాయి.

మధ్యంతర ఎన్నికల ఫలితాలు వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆయన కంపెనీలపై ప్రభావం పడుతుంది. ట్రంప్‌కు సంబంధించిన వ్యాపార ప్రయోజనాలు, ప్రభుత్వ కాంట్రాక్టులపై డెమోక్రాట్లు దృష్టి సారిస్తారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల ప్రభుత్వ లావాదేవీలు, నియంత్రణ సంబంధిత అంశాలపై విచారణ జరపాలనే డిమాండ్లు రావచ్చు.