US-Iran War: ఇరాన్‌కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..

  • ఇరాన్‌కు అమెరికా 5 కఠిన షరతులు..
  • అణు కార్యక్రమాలే టార్గెట్‌గా యూఎస్ ప్లాన్స్..
  • యురేనియాన్ని అప్పగించాలని డిమాండ్..
  • ఈ షరతుల కారణంగానే చర్చల్లో ప్రతిష్టంభన..
Us Iran War

Us Iran War

US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరోసారి తీవ్రతరం అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నా్యి. ఈవారంలో అమెరికా, ఇజ్రాయిల్ కలిసి దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికన్ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను నియంత్రించేందుకు అమెరికా కఠినమైన 5 షరతులను విధించినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ షరతుల కారణంగానే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ అణు కార్యక్రమాలను కట్టడి చేసేందుకు అమెరికా షరతులు విధించింది. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియాన్ని తమకు అప్పగించాలని యూఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే కాకుండా ఇరాన్‌ అణు కార్యక్రమాలనున నిలిపేయాలని కోరింది. గతంలో ఆంక్షల కారణంగా జరిగిన ఆర్థిక నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించబోమని అమెరికా స్పష్టం చేసింది. విదేశాల్లో నిలిపేసిన ఇరాన్ నిధుల్లో 25 శాతం మాత్రమే విడుదల చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్ అన్ని షరతులకు ఒక వేళ అంగీకరించిన సైనిక ఒత్తిడి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఇరాన్ కూడా అమెరికాకు 5 షరతులు పెట్టింది. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని ముగించాలని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని, విదేశాల్లో ఉన్న ఇరాన్ నిధుల్ని విడుదల చేయాలని కోరింది. ఇదే కాకండా యుద్ధాల వల్ల తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో అమెరికా మరోసారి దాడికి దిగితే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.