Site icon NTV Telugu

US: అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం

Trump

Trump

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించారు. అక్రమ వలసదారుల్ని పట్టుకుని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపించారు.

తాజాగా అక్రమ వలసదారుల కోసం ట్రంప్ ప్రభుత్వం మరో ప్రత్యేక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్రమ వలసదారుల కోసం ‘‘ఎగ్జిట్ బోనస్ స్కీమ్‌’’ను ప్రకటించింది. స్వచ్ఛందంగా అమెరికాను వీడేవారికి రూ.2.40 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందిస్తున్నట్లుగా వెల్లడించింది. సీబీపీ హోమ్‌ యాప్‌ (CBP Home App) ద్వారా దరఖాస్తు చేసుకుంటే వలసదారులకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. అరెస్ట్‌లు లేకుండా ప్రాజెక్ట్ హోమ్‌ కమింగ్ స్కీమ్ ద్వారా స్వదేశాలకు చేర్చనున్నట్లు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఉచిత విమాన టిక్కెట్‌ను అందిస్తోంది. ఆ శాఖ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తాజ్ మహల్ చిత్రాన్ని ఉపయోగించి పత్రాలు లేని భారతీయులు సంప్రదించాలని కోరింది. ‘‘మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇంటికి వెళ్ళవచ్చు! కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) హోమ్ ద్వారా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లినప్పుడు ఉచితంగా ఇంటికి విమాన ప్రయాణం, 2,600 ఎగ్జిట్ బోనస్ పొందండి.’’ అని పోస్ట్‌లో పేర్కొంది.

అక్రమ వలసలను తగ్గించేందుకు ఇది సమర్థవంతమైన మార్గమని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. స్కీమ్‌లో భాగంగా ఎవరినీ అరెస్ట్ చేయకుండా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. “ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్” పేరుతో చేపడుతున్న ఈ పథకం ద్వారా అక్రమ వలసదారులకు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా స్వదేశానికి వెళ్లే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ఈ ప్రతిపాదన అమలు అయితే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల సమస్యకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Exit mobile version