Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన హింసాత్మక నిరసనలకు షేక్ హసీనా తన ప్రధాని మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె సొంత దేశం నుంచి పారిపోయి ఇండియా చేరుకున్నారు. అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి అక్కడ హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరిగాయి. చాలా చోట్ల హిందూ మహిళలపై అకృత్యాలను ఎదుర్కొన్నారు. హిందూ ఆలయాలపై, వ్యాపారాలపై దాడులు చేశారు. అలాగే చర్చ్‌లను కూడా మతోన్మాద మూకలు వదిలిపెట్టలేదు.
Read Also: Buchepalli Siva Prasad Reddy: దర్శిలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన..
ఇదిలా ఉంటే, మైనారిటీలపై హింసను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృంధం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి చేరుకుంది. నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. జమాతే ఇస్లామీ వంటి సంస్థతో పాటు ఇతర ర్యాడికల్ ముస్లిం ఆర్గనైజేషన్లు మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నారనే నివేదికలు ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) ఒక నెలపాటు బంగ్లాదేశ్‌లో ఉండి, హింసాత్మక ఆరోపణలపై విచారణ జరుపుతుంది. హిందూ మైనారిటీ గ్రూపులు యూఎన్ బృందాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగాబంధు ఫౌండేషన్ తరపున, వారు ప్రతినిధి బృందంతో సమావేశం కావాలని అభ్యర్థించారు. భారీగా హత్యలు జరిగాయని, హిందూ ప్రార్థనా స్థలాలు, నివాసాలు ధ్వంసమైనట్లు పేర్కొంటూ వారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటినియో గుటెర్రస్‌కి లేఖ కూడా రాశారు.