వెనిజులా వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం వెనిజులాపై అమెరికా భీకరమైన సైనిక చర్యకు దిగి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను కారకాస్‌లో బంధించి అమెరికా తరలించింది. పెద్ద ఎత్తున బాంబ్ దాడులు చేసింది. ముందుగానే దేశమంతా విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో అంధకారం అలుముకుంది. అనంతరం అధ్యక్షుడి కుటుంబాన్ని బంధించింది. ఈ బాంబు దాడుల్లో 40 మంది దాకా చనిపోయినట్లుగా వెనిజులా అధికారి తెలిపారు.
తాజాగా ఇదే వ్యవహారంపై సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుందని ఐక్యరాజ్యసమితికి సోమాలియా శాశ్వత ప్రతినిధి ఖాదీజా అహ్మద్ తెలిపారు. కౌన్సిల్‌లో శాశ్వత సభ్యదేశమైన కొలంబియా అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశాలైన చైనా, రష్యా మద్దతు తెలిపాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌పై న్యూయార్క్‌లోని దక్షిణ జిల్లాలో అభియోగాలు మోపబడ్డాయని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి తెలిపారు. ఆదివారం న్యూయార్క్ చేరుకున్న జంటపై నార్కో-టెర్రరిజం, కొకైన్ దిగుమతికి కుట్ర పన్నడం, అమెరికాకు వ్యతిరేకంగా మెషిన్ గన్‌లు, విధ్వంసక పరికరాలను కలిగి ఉండటానికి కుట్ర పన్నడం వంటి అభియోగాలు మోపబడ్డాయని పేర్కొన్నారు.
అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. నికోలస్ జంటను న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం. తీసుకెళ్లే ముందు జంటకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. మళ్లీ కేసు నమోదు చేసి ఇద్దరిని విచారించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
