ట్రంప్ బెదిరింపులు కారణమో తెలియదు గానీ మిత్రదేశాలు మెల్లమెల్లగా అమెరికాకు దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న భారతదేశంతో యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మరో మిత్ర దేశమైన బ్రిటన్ కూడా ఇప్పుడు చైనాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే భారత్-ఈయూ డీల్ తమను నిరాశ పరిచ్చిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే.. నెమ్మది.. నెమ్మదిగా అమెరికాకు మిత్ర దేశాలు దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

నాలుగు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చైనాకు వచ్చారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా చైనాలో పర్యటించారు. ఆయా దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ పర్యటనలు అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మిత్ర దేశాలు దూరమవుతున్నట్లుగా భావిస్తోంది.

ఇక జిన్‌పింగ్‌తో సమావేశం తర్వాత కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, భద్రతను ప్రోత్సహించుకోవడానికి రెండు దేశాల మధ్య సమతుల్య సంబంధాన్ని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. చైనా ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. విభేదాలు ఉన్నప్పటికీ సమస్యలు చర్చించడం చాలా అవసరం అని పేర్కొన్నారు. బ్రిటన్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి చైనా సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మిత్రుల్ని.. శత్రువుల్ని ఒకేలా చూస్తున్నారు. పబ్లిక్ వేదికలపై ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య దావోస్‌లో ట్రంప్.. కెనడాను తీసిపడేసినట్లుగా మాట్లాడారు. అంతకముందు కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా మారుస్తామని వెల్లడించారు. ఇక ఈ మధ్య వెనిజులా దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక.. గ్రీన్‌లాండ్‌ను కూడా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ఐరోపా దేశాలకు రుచించలేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోబోనివ్వమని తేల్చి చెప్పాయి. దీంతో అప్పటి నుంచి మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాలపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.