ఒక్కోసారి అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో.. ఎవ్వరూ ఊహించలేరు. అప్పటిదాకా మన కళ్ళముందు సాదాసీదాగా కనిపించిన వ్యక్తి, రాత్రికిరాత్రే స్టార్ అయిపోవచ్చు. ఇలాంటి వారిని మనం ఇప్పటికే ఎంతోమందిని చూశాం. ఇప్పుడు తాజాగా మూలన పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్, ఒక కుటుంబాన్ని కోటీశ్వరుల్ని చేసిన ఉదంతం యూకేలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
యూకేలోని మిడ్‌ల్యాండ్స్‌లో ఉంటోన్న ఒక కుటుంబం.. 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేసింది. కొన్నాళ్ళు దీన్ని అలంకరణ వస్తువుగా వినియోగించారు. క్రమంగా పగుళ్లు రావడంతో ఓ మూలన పడేశారు. అలా ఆ ఫ్లవర్ వేజ్‌ని మూలన పడేసి చాలా సంవత్సరాలే అవుతోంది. అయితే.. అనుకోకుండా ఒక రోజు వాళ్లింటికి ఓ ఆర్కియాలజిస్ట్ వచ్చాడు. అతని దృష్టి ఆ ఫ్లవర్ వేజ్‌పై పడింది. కాసేపు పరిశీలించిన ఆ ఆర్కియాలజిస్ట్.. అది చాలా విలువైనదని తెలుసుకొని, దాని విశిష్టత గురించి ఆ ఫ్యామిలీకి తెలియజేశాడు. 18వ శతాబ్దపు రాజు కియాన్‌లాంగ్ కాలంలో దీనిని ఉపయోగించేవారని తెలిపాడు.
ఈ ఫ్లవర్ వేజ్ జాడీతో బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారని.. దీనిపై ఉన్న ఎనిమిది అమర చిహ్నాలు ‘దీర్ఘాయువును – శ్రేయస్సును’ సూచిస్తుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం దీని ధర కోట్లలో పలుకుతుందని చెప్పాడు. ఈ ఫ్లవర్ వేజ్ గురించి తెలుసుకున్న ఓ చైనా ధనవంతుడు.. 1.2 మిలియన్ పౌండ్లకు (రూ.11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. అది తన వారసత్వ సంపద అని, తమ వంశీయులు పోగొట్టుకున్న ఆ వస్తువును తిరిగి పొందినందుకు సంతోషంగా ఉందని కొనుగోలుదారుడు చెప్పాడు. ఇలా.. ఆ ఫ్లవర్ వేజ్ ఆ ఫ్యామిలీని కోటీశ్వరుల్ని చేసింది.