రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతోంది. నాలుగేళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా రోజుల నుంచి విఫలమవుతున్న చర్చలు.. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
ఆదివారం ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమై శాంతి ఒప్పందంపై చర్చించారు. 20 పాయింట్ల ప్రణాళికపై ఇరువురి నేతలు చర్చించారు. అయితే ఉక్రెయిన్ భద్రతాపై ట్రంప్ హామీ ఇవ్వడంతో శాంతి చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. భేటీ తర్వాత జెలెన్‌స్కీ-ట్రంప్ మాట్లాడుతూ.. శాంతి చర్చలు 90-95 శాతం కొలిక్కి వచ్చాయని.. వచ్చే నెలలో పూర్తి పరిష్కారం దొరుకుతుందని జెలెన్‌స్కీ అన్నారు. కాదు.. కాదు.. వచ్చే వారమే శాంతి ఒప్పందం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక్క డాన్‌బాస్ దగ్గరే పంచాయితీ తెగలేదని.. అది కూడా పరిష్కరింపబడితే వచ్చే వారమే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరగవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే జెలెన్‌స్కీతో సమావేశానికి ముందు పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటలు మాట్లాడినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ భవిష్యత్తు గురించి పుతిన్‌తో చర్చించానని.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అది రష్యా నియంత్రణలోనే ఉందని చెప్పారని.. ఇప్పుడైతే ఈ ప్లాంట్‌ను తిరిగి ఉక్రెయిన్‌కు అప్పగించేందుకు పుతిన్ సహకరిస్తున్నారని ట్రంప్ తెలిపారు. అంతేకాదు.. ఉక్రెయిన్ పునర్‌నిర్మాణంలో కూడా పుతిన్ కూడా సహకరిస్తారని.. ఆయన అంత మంచి వాడు అంటూ ట్రంప్ కితాబు ఇచ్చారు. శాంతి ఒప్పందానికి పుతిన్ చాలా దగ్గరగా ఉన్నారని.. త్వరలోనే ఉక్రెయిన్-రష్యా నేతలు కూడా కలుస్తారని ఆశాభావం కనుపరిచారు. ఏదేమైనా త్వరలోనే శుభం కార్డు పడుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
పుతిన్ రాయబారి..
ఇదిలా ఉంటే ట్రంప్ శాంతి ప్రతిపాదనను పుతిన్ రాయబారి కిరిల్ డిమిత్రివ్ స్వాగతించారు. శాంతి కోసం ట్రంప్, అతని బృందం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని పేర్కొ్న్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
యూరోపియన్ నేత
ఇక ఉక్రెయిన్ శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు మంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
