డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాదంతా సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. ఇప్పుడైతే కొత్త ఏడాది ప్రారంభం నుంచే మరింత దూకుడుగా వెళ్తున్నారు. సైనిక చర్యతో వెనిజులాను సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి దేశాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఇప్పుడు గ్రీన్‌లాండ్ మీద ఫోకస్ పెట్టారు. అమెరికా భద్రతా నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకుంటామని ప్రకటించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే గత వారం వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని బహుకరించారు. అయితే నోబెల్ కమిటీ రూల్స్ ప్రకారం.. నోబెల్ శాంతి బహుమతిని అమ్మడం గానీ.. మరొకరికి బదిలీ చేయడం గానీ ఉండదు. నోబెల్ ప్రైజ్ ట్రంప్‌కు బదిలీ చేయడంపై నోబెల్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో నోబెల్ కమిటీ తీరుపై ట్రంప్ మండిపడ్డారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాన్ గహర్‌కు ట్రంప్ సుదీర్ఘ లేఖ రాశారు. లేఖలో గ్రీన్‌లాండ్‌తో పాటు డెన్మార్క్ హక్కులు, భద్రతా పరమైన సమస్యలను ప్రస్తావించారు. ఇకపై తాను శాంతికి కట్టుబడి లేనని.. గ్రీన్‌లాండ్‌పై పూర్తి స్థాయి నియంత్రణ కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు నిరాకరించినప్పుడు.. ఇప్పుడు శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదన్నారు. అమెరికాకు ఏది మంచిదో.. అదే ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
గ్రీన్‌లాండ్..
ఇక గ్రీన్‌లాండ్ అంశం గురించి ప్రస్తావిస్తూ.. పూర్తి స్థాయి నియంత్రణ కోరుతున్నట్లు తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను రష్యా, చైనా నియంత్రణ నుంచి డెన్మార్క్ రక్షించలేకపోయిందని.. అందుకే తమ నియంత్రణలోకి తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. నాటో కోసం తాను ఎన్నో చేశానని.. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కోసం నాటో ఏదైనా చేయాలని కోరారు. గ్రీన్‌లాండ్‌పై పూర్తి స్థాయి నియంత్రణ వచ్చేంత వరకు ప్రపంచం సురక్షితంగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
ట్రంప్ రాసిన లేఖ అందినట్లుగా నార్వే ప్రధాని జోనాన్ గహర్ ధృవీకరించారు. ఆదివారం సాయంత్రం సందేశం అందినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నోబెల్ శాంతి బహుమతి నిరాకరించినప్పుటి నుంచి నార్వేను అనేక సార్లు ట్రంప్ విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి లేఖ ద్వారా తప్పుపట్టారు.
ఈయూపై టారిఫ్ వార్
ఇదిలా ఉంటే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో తన ప్రణాళికకు యూరోపియన్ దేశాలు అడ్డు తగులుతుండడంతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1, 2026 నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తామని.. అంతేకాకుండా జూన్ 1 నుంచి 25 శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా భద్రతకు గ్రీన్‌లాండ్ చాలా అవసరం అని.. దాని మీద ఒప్పందం కుదరకపోతే.. అవసరమైతే బలవంతంగానైనా తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
అయితే ట్రంప్ ప్రకటనపై యూరోపియన్ దేశాలు, నాటో నాయకత్వం తిరుగుబావుటా ఎగరవేశారు. ట్రంప్ ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టాయి. తాజాగా యూరోపియన్ దేశాధినేతలంతా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశమై ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. యూరోపియన్ దేశాలపై ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని.. ఇలాగైతే అమెరికన్ కంపెనీలను యూరోపియన్ మార్కెట్ నుంచి మినహాయించాలని కోరనున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా అమెరికాపై 93 బిలియన్ యూరోల సుంకాలు విధించాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇక స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు యూరోపియన్ దేశాలు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి గ్రీన్‌లాండ్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికాతో యూరోపియన్ దేశాలు పరోక్ష యుద్ధానికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేడు నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం
