Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం

  • నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం
  • నలుగురు రిపబ్లికన్లు, డెమోక్రాట్లందరూ దేశ విరోధులు
  • డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
Trump

Trump

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తుది దశ చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో తన యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తన దౌత్య ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోందని విమర్శించారు.

ట్రూత్ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులో… “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు తుది దశ చర్చలు జరుగుతున్న సమయంలో హౌస్ అర్థంలేని ఓటింగ్ నిర్వహించింది. నలుగురు రిపబ్లికన్లు, డెమోక్రాట్లందరూ కలిసి నా యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి మద్దతు ఇచ్చారు” అని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు ఏ దశలో ఉన్నాయో కాంగ్రెస్ సభ్యులకు పూర్తిగా తెలుసని, అయినప్పటికీ ఇలాంటి చర్యలకు పాల్పడటం దేశభక్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. “ఇలాంటి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన పని ఎవరు చేస్తారు?” అని ప్రశ్నించారు. చివరగా ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)’ నినాదాన్ని ప్రస్తావిస్తూ తన మద్దతుదారులకు సందేశం పంపించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

×
×
Ad

డెమోక్రాట్లపై విమర్శలు


డెమోక్రాట్లు రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. “వారు డెరేంజ్‌మెంట్ సిండ్రోమ్‌తో నడుస్తున్నారు. నాకు మరో విజయం దక్కకుండా చేయడం కోసం దేశం విఫలమవడానికైనా సిద్ధంగా ఉన్నారు” అని మండిపడ్డారు తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన నలుగురు రిపబ్లికన్ సభ్యులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేవారు. “వారు కేవలం ప్రచారం కోసం రాజకీయాలు చేసే గ్రాండ్‌స్టాండర్లు. తమ చర్యలపై సిగ్గుపడాలి” అని వ్యాఖ్యానించారు.

హౌస్‌లో ఆమోదం


రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ నలుగురు రిపబ్లికన్ సభ్యులు డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. దీంతో 215-208 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. ఇప్పుడు ఇది సెనేట్‌కు వెళ్లనుంది. ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభమైన మూడు నెలల తర్వాత ట్రంప్‌ను సైనిక కార్యకలాపాలు తగ్గించాలని కోరుతూ రిపబ్లికన్ ఆధ్వర్యంలోని హౌస్ ఆమోదించిన తొలి తీర్మానం ఇదే కావడం గమనార్హం.

రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలు


డెమోక్రాట్ల ఆరోపణల ప్రకారం.. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించే ముందు ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదని, ఇది అమెరికా రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు. అమెరికా యుద్ధ అధికారాల చట్టం ప్రకారం.. విదేశీ యుద్ధ కార్యకలాపాల్లో సైన్యాన్ని ప్రవేశపెట్టిన 60 రోజుల్లోపు అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. ఆ గడువు ఇప్పటికే ముగిసిందని.. ప్రస్తుతం ట్రంప్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్‌తో చర్చలు కీలక దశలో ఉన్నాయని.. ఈ సమయంలో తన అధికారాలను పరిమితం చేయడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు హానికరమని వాదిస్తున్నారు.

సొంత పార్టీ నుంచే తిరుగుబాటు


రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ ఎంపీలు థామస్ మాస్సీ, బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్, టామ్ బారెట్, వారెన్ డేవిడ్‌సన్ పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి ఓటేశారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ ఎంపీ టామ్ బారెట్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందుల పట్ల తమ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు. మరో ఎంపీ థామస్ మాస్సీ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడిపోతున్నారని, సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధంతో ప్రజలు, పార్లమెంటు రెండూ విసిగిపోయాయనడానికి ఈ ఓటింగే నిదర్శనమని చెప్పారు.