అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. ‘‘అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను అనుకోలేదు.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఫ్లోరిడాలో జరిగిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాతో కలిసి గల్ఫ్ దేశాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సౌదీ యువరాజుపై చురకలు అంటించారు. ‘‘ఇలా జరుగుతుందని అతను అనుకోలేదు… నన్ను ఇలా ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుందని కూడా ఊహించలేదు… మరో సాధారణ అమెరికా అధ్యక్షుడిలా ఉంటాననుకున్నాడు.’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
అలా సౌదీ యువరాజును విమర్శించిన వెంటనే ట్రంప్ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ‘‘అద్భుతమైన వ్యక్తి’’, ‘‘యోధుడు”గా అభివర్ణించారు. సౌదీ అరేబియా ప్రజలు అతన్ని చూసి గర్వపడవచ్చని పొగడ్తలతో ముంచెత్తారు. క్షణాల్లోనే ట్రంప్ తన మాటలను మార్చేశారు.
ఇదిలా ఉంటే ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మహమ్మద్ బిన్ సల్మాన్ గోప్యంగా ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతూ ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలని సూచించినట్లుగా నివేదికలో పేర్కొంది. దీనిని “చారిత్రాత్మక అవకాశం”గా పేర్కొన్నట్లు తన కథనంలో తెలిపింది. అయితే ఈ ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. తాము శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది.
