అగ్ర రాజ్యం అమెరికాను ఎవరు పరిపాలించినా అధ్యక్షుల ఫొటోలు వైట్‌హౌస్‌లో ఉంటాయి. డెమొక్రాటిక్ నేతలైనా.. రిపబ్లికన్ నేతలైనా వారి చిత్రపటాలు శ్వేతసౌధంలో ఉంచుతారు. కొత్తగా ‘ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్’ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిని కలిసేందుకు వచ్చే అతిథులు, ప్రముఖులు గ్యాలరీని సందర్శించేలా ఏర్పాటు చేశారు. తాజాగా చిత్రపటాల కింద కొందరిపై విమర్శలు.. మరికొందరిపై పొగడ్తలతో కూడిన రాతలు ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఏయే కాలాల్లో ఎవరు.. ఎప్పుడు పరిపాలించారో వారి చిత్రపటాలు పెట్టారు. తాజాగా ఆ చిత్రపటాల కింద కొత్తగా రాతలు కూడా పొందిపరిచారు. ఆ రాతలు స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ రాసినట్లుగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రతి అధ్యక్షుడి గురించి వర్ణిస్తూ రాశారు. జో బైడెన్, బరాక్ ఒబామా, జిమ్మీ కార్టర్ వంటి డెమొక్రాటిక్ అధ్యక్షులపై తీవ్ర పదజాలాలు ప్రయోగించారు. రోనాల్డ్ రీగన్, రిచర్డ్ నిక్సన్ వంటి రిపబ్లికన్ నేతలపై మాత్రం ప్రశంసలు కురిపిస్తూ రాతలున్నాయి. ఇక జో బైడెన్ ఫొటో లేకుండానే రాతలు రాశారు. అమెరికా చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జో బైడెన్…
జో బైడెన్‌కు సంబంధించిన రెండు ఫలకాలు ఉన్నాయి. ఆ చిత్రపటాలపై ‘‘ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు’’ అంటూ వర్ణిస్తూ రాతలు ఉన్నాయి. ఎన్నికల్లో అవినీతికి పాల్పడి పదవీ బాధ్యతలు స్వీకరించారంటూ ఆరోపించారు. ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రతా వైఫల్యాలు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ, అంతర్జాతీయ సంఘర్షణలకు దారి తీశాయంటూ నిందిస్తూ రాశారు. ఇంకో ఫలకంపై జో బైడెన్ ‘స్లీపీ’, ‘క్రూకెడ్’ అంటూ రాసి ఉన్నాయి. ట్రంప్ చిత్రపటం దగ్గర మాత్రం అమెరికాను కాపాడేవాడు అంటూ రాసి ఉంది.
ఒబామా…
ఇక ఒబామా చిత్రపటం దగ్గర ‘‘అమెరికన్ చరిత్రలో అత్యంత విభజనకర రాజకీయ వ్యక్తుల్లో ఒకరు’’ అంటూ రాసి ఉంది. అఫర్డబుల్ కేర్ చట్టం, ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ ఒప్పందాన్ని విమర్శిస్తూ రాతలు ఉన్నాయి. 2016లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై నిఘా పెట్టారని పేర్కొన్నారు.
జార్జ్ డబ్ల్యు బుష్..
ఇక జార్జ్ డబ్ల్యు బుష్ చిత్రపటం కింద కూడా విమర్శలు ఉన్నాయి. ఆప్ఘనిస్థాన్, ఇరాక్‌లో యుద్ధాలు ప్రారంభించారని.. ఈ రెండు కూడా జరిగి ఉండకూడదని రాసి ఉన్నాయి. ఇక ఆయన పదవి చివరి సంవత్సరంలో 2008లో దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. ఇక డిసెంబర్ 2024లో మరణించిన జిమ్మీ కార్టర్ పదవీ కాలాన్ని కూడా విమర్శిస్తూ రాతలున్నాయి.
