వెనిజులాకు ట్రంప్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. తక్షణమే చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
గత శనివారం అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించి అమెరికా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి వెనిజులాపై అమెరికా పెత్తనం చెలాయిస్తోంది. చమురును స్వాధీనం చేసుకోబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇకపై చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైన డెల్సీ రోడ్రిగ్జ్‌కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Supreme Court: కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎలా తెలుస్తుంది? కుక్కల బెడదపై కీలక ఆదేశాలు
ఇదిలా ఉంటే డిసెంబర్ చివరిలోనే చమురు బావులు మూసివేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమెరికా దిగ్బంధం చేయడంతో కొత్త నిల్వలు లేకపోవడంతో వెనిజులా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రోడ్రిగ్జ్ పాలన కూడా ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.
‘‘మొదట… చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలను తరిమికొట్టి ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలి… రెండవది.. వెనిజులా చమురు ఉత్పత్తిలో అమెరికాతో ప్రత్యేకంగా భాగస్వామిగా ఉండటానికి అంగీకరించాలి. భారీగా ముడి చమురును విక్రయించేటప్పుడు అమెరికాకు అనుకూలంగా ఉండాలి.’’ అని ట్రంప్ బృందం హెచ్చరించినట్లుగా వర్గాలు తెలిపాయి. చైనా చాలా కాలంగా వెనిజులాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అతిపెద్ద చమురు కొనుగోలుదారు చైనానే. ఇప్పుడు వెనిజులాను అమెరికా స్వాధీనం చేసుకున్నాక.. ఏ ఇతర దేశాల పెత్తనం ఉండకూడదని అమెరికా భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Maharashtra: మున్సిపల్ ఎన్నికల వేళ సరికొత్త రాజకీయం.. కాంగ్రెస్-బీజేపీ ఏం చేశాయంటే..!
నివేదిక ప్రకారం.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రైవేట్ సమావేశంలో శాసనసభ్యులతో మాట్లాడుతూ.. వెనిజులాలో ప్రస్తుతం చమురు ట్యాంకర్లు ఖాళీ అయ్యాయని.. ఈ నేపథ్యంలో ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి రెండు వారాల్లో వెనిజులా దివాలా తీయొచ్చని అమెరికా అంచనా వేస్తోంది.
చమురుపై ట్రంప్ పెత్తనం
వెనిజులాలోని తాత్కాలిక అధికారులు మార్కెట్ ధరకు విక్రయించడానికి 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిధులను తాను నియంత్రిస్తానని ట్రంప్ తెలిపారు. వెనిజులా, యునైటెడ్ స్టేట్స్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఆ నిధులు ఉపయోగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.