Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!

  • ఇరాన్‌పై అమెరికా మరోసారి ఉక్కుపాదం..
  • చైనా రిఫైనరీలు, బ్యాంకులే టార్గెట్
Trump5

Trump5

Trump: ఇరాన్‌పై అమెరికా ఒత్తిడిని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో.. ఇరాన్‌కు నిధులు అందే అన్ని మార్గాలను మూసివేయడమే లక్ష్యంగా వాషింగ్టన్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ప్రకటించారు. వచ్చే వారం టెహ్రాన్‌పై కొత్త ఆంక్షలు ప్రకటించే అవకాశం ఉందని బెస్సెంట్ వెల్లడించారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో అమెరికా తీసుకోబోయే తదుపరి చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే వందలాది సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు

ఇరాన్ అణు కార్యక్రమం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు వంటి కారణాలతో అమెరికా, ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ దశాబ్దాలుగా టెహ్రాన్‌పై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆంక్షల తీవ్రత మరింత పెరిగింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ పరిధిలోని OFAC సమాచారం ప్రకారం.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఇప్పటివరకు 1,000 మందికి పైగా వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించారు. ఇరాన్‌తో సంబంధం ఉన్న సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులను కూడా స్తంభింపజేశారు. ఇరాన్ చమురుకు చైనా అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. 2025 గణాంకాల ప్రకారం.. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 80 శాతానికి పైగా చైనానే కొనుగోలు చేస్తోంది. చైనాలోని చిన్న, స్వతంత్ర రిఫైనరీలను ‘టీపాట్స్‌’గా పిలుస్తారు. ఇరాన్ చమురు కొనుగోళ్లలో వీటి పాత్ర కీలకం. అమెరికా ఆర్థిక వ్యవస్థతో వీటికి పెద్దగా సంబంధాలు లేకపోవడంతో ఇప్పటివరకు ఆంక్షల ప్రభావం పరిమితంగానే ఉంది. అయితే ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు మార్కెట్‌ను దెబ్బతీయాలంటే ఈ రిఫైనరీలను కూడా లక్ష్యంగా చేసుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.

చైనా బ్యాంకులకు అమెరికా హెచ్చరిక
ఇరాన్ చమురు ఆదాయాలు, ఆయుధాల కొనుగోళ్లకు సహకరిస్తున్న చిన్న సంస్థలపై ఇప్పటికే అమెరికా ద్వితీయ ఆంక్షలు విధించింది. తాజాగా చైనా, హాంకాంగ్‌కు చెందిన పెద్ద ఆర్థిక సంస్థలపై కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ నిధుల లావాదేవీలకు తమ వ్యవస్థలను ఉపయోగిస్తే పెద్ద చైనా బ్యాంకులను సైతం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించినట్లు సమాచారం. అయితే దీనివల్ల చైనా ప్రతీకార చర్యలకు దిగే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వాషింగ్టన్‌లో ఉంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్ కొత్త కంపెనీలు, మధ్యవర్తుల ద్వారా చమురు ఆదాయాలను తరలిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఇరాన్‌కు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కూడా చర్యలు తీసుకునేందుకు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సిద్ధమవుతోందట. ఒక కంపెనీపై ఆంక్షలు విధించిన వెంటనే ఇరాన్ మరో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. చమురు రవాణాదారులు, కొనుగోలుదారులు, కరెన్సీ మార్పిడి సంస్థలపై మరింత కఠినంగా నిఘా పెట్టే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే విమానయాన రంగంపైనా కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

భూ మార్గాల దిగ్బంధనంపైనా చర్చ
సముద్ర, వాయు మార్గాలతో పాటు ఇరాన్ భూ వాణిజ్య మార్గాలను కూడా అడ్డుకునే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరాన్ పొరుగు దేశాల సహకారం అవసరం. అయితే భూ దిగ్బంధనం అమలు చేయడం అత్యంత క్లిష్టమైన చర్యగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ చర్య అమల్లోకి వస్తే ఇరాన్‌కు ఆహారం, ఇంధనం, దుస్తులు వంటి కీలక దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో పొరుగు దేశాలతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో పలుమార్లు హెచ్చరించారు. అయితే ఈ తరహా టారిఫ్‌లకు సంబంధించిన కొన్ని చట్టపరమైన అంశాలు సవాళ్లుగా మారాయి. ఇదిలా ఉండగా.. రష్యాపై కొత్త ఆంక్షల బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఇందులో ఇరాన్‌కు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఇరాన్‌కు ఆయుధాల వాణిజ్యం లేదా కొనుగోళ్లలో సహకరించే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఈ బిల్లు కల్పించే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం ఇంకా అవసరం. మొత్తంగా చూస్తే.. ఇరాన్‌కు చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆర్థిక లావాదేవీలను కట్టడి చేయడం, చైనా మార్కెట్‌ను దెబ్బతీయడం, ఆంక్షలు తప్పించుకునే నెట్‌వర్క్‌లను ఛేదించడం వంటి చర్యలతో టెహ్రాన్‌పై ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.