Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య వివాదం ముదురుతోంది. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు ఇందుకు వేదికగా మారింది. జార్జియా మెలోని తనతో ఫోటో దిగడానికి పదే పదే అభ్యర్థించిందని, ఇటలీలో తన ప్రజాదరణ పెంచుకోవడానికి ఆమె ప్రయత్నించిందని మరోసారి ట్రంప్ ఆరోపించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇందులో ‘‘ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నాతో ఫోటో కోసం పదే పదే అడిగారు’’ అని రాశారు.
ఇటలీలో మెలోని ప్రజాదరణ తగ్గుతోందని, దీని కారణం ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా అమెరికా చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడమే అని ట్రంప్ నిందించారు. ఇరాన్ యుద్ధ సమయంలో ఇటలీ తన ఎయిర్ స్ట్రిప్స్‌లు, రన్‌వేలను ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రధాన లాజిస్టిక్ సవాలుగా ట్రంప్ విమర్శించారు. ఇటలీతో పాటు నాటో మిత్రదేశాల రక్షణ కోసం అమెరికా ఏటా వందల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నప్పటికీ, ఆమె మాకు ల్యాండింగ్ స్ట్రిప్ ఇవ్వలేదని ట్రంప్ అన్నారు. ఇరాన్‌ను యూఎస్ ఓడించిన తర్వాత మాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు.
అయితే, ఈ వాదనల్ని ఇంతకుముందు కూడా ట్రంప్ చేశారు. దీనికి మెలోని కూడా ఘాటుగా బదులిచ్చింది. ట్రంప్ చెప్పినవన్ని కల్పితాలే అని మెలోని అన్నారు. “డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు తన మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కావడం లేదు: పైగా, ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు,” అని మెలోని అన్నారు.

