Pakistan: అసిమ్ మునీర్‌ ప్లాన్‌పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..

  • ఆసిమ్ మునీర్ ప్లాన్‌పై తిరగబడుతున్న పాకిస్తాన్ ప్రజలు..
  • సింధ్ విభజనపై కరాచీలో భారీ ర్యాలీ..
  • ప్రత్యేక సింధు దేశ్ కావాలని డిమాండ్..
  • పాక్‌లో కొత్తగా 10కి పైగా ప్రావిన్సు ఏర్పాటుపై మునీర్ ప్రణాళిక..
Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌తో కొత్త ప్రావిన్సులు ఏర్పాటు చేయాలనుకునే ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ ప్లాన్‌పై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో నాలుగు ప్రావిన్సులు – సింధ్, పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లు ఉన్నాయి. వీటిని విడగొట్టి 10కి పైగా ప్రావిన్సులుగా మార్చాలని మునీర్ ప్లాన్ చేస్తున్నాడు. మునీర్ తన ప్లాన్‌ను ఆయన సన్నిహితుడు పాక్ హోం మంత్రి ముహ్సిన్ నఖ్వీతో అమలు చేయించుకు ప్లాన్ చేస్తున్నాడు.

సింధు దేశ్ కోసం ఉద్యమం..

ఇదిలా ఉంటే, ఆసిమ్ మునీర్ ప్లాన్‌పై చాలా ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్సు నుంచి కరాచీని వేరు చేయాలని భావిస్తున్నారు. దీంతో సింధ్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ మాతృభూమిని ముక్కలు చేయాలని కుట్ర పన్నాడని ఆరోపిస్తూ వేలాది మంది కరాచీ వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్ ప్రావిన్సును ఆర్థికంగా దిగ్బంధిస్తామని సింధీ సంస్థలు హెచ్చరించాయి. తమకు ప్రత్యేకమైన ‘‘సింధు దేశ్’’ కావాలనే డిమాండ్‌ను తెర పైకి తీసుకువచ్చాయి.

నాలుగు సింధీ జాతీయవాద పార్టీల కూటమి అయిన ‘జీయ్ సింధ్ రహబర్ కమిటీ (JSRC)’ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనకు న్యాయవాదులు, పౌర హక్కుల సంస్థలు, ప్రతినిధులు మద్దతు తెలిపారు. దీంతో కరాచీ నగరంలో ప్రధాన రహదారులు మూతపడ్డాయి. కరాచీతో పాటు హైదరాబాద్(సింధ్), నవాబ్ షా, లర్కానా, దాదు జిల్లాలోని మెహన్ పట్టణంలో భారీగా నిరసనలు జరిగాయి.

విభజనే వివాదానికి కారణం..

పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన ఆరథిక సదస్సులో కొత్త ప్రావిన్సుల గురించి ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న 4 ప్రావిన్సుల్ని 12 నుంచి 15 కు పెంచాలని ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పేర్కొన్నారు. దీనిపై 2026 చివరి నాటికి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రజాభిప్రాయం అనే నాటకం ఆడుతున్నారని జాతీయవాద నేతలు ఆరోపిస్తున్నారు.

రక్తపాతం తప్పదని భుట్టో హెచ్చరిక..

సింధ్ విభజనపై ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా స్పందించారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ, సింధ్‌ను విభజించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఆయుధాలు పట్టాల్సి వస్తుందని, కరాచీ, హైదరాబాద్ వీధుల్లో రక్తపాతం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సింధ్ లో అత్యంత బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రావిన్సును విడదీస్తే రాజకీయంగా తమకు ఉనికి ఉండదని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే కాకుండా చాలా పార్టీలు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నాయి.

పాక్ సైన్యంపై ఆరోపణలు..

పాకిస్తాన్ సైన్యంపై సింధ్ తో పాటు ఇతర ప్రావిన్సుల ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పంజాబ్ ఆధిపత్యంలో పాక్ సైన్యం సింధ్‌లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమిని, తీర ప్రాంతాల దీవుల్ని, గ్యాస్, బొగ్గు వంటి సహజసంపదనను దోచుకుంటోందని జాతీయవాదులు ఆరోపించారు. ‘జీయ్ సింధ్ ముత్తాహిదా మహజ్ (JSMM)’ సంస్థ పంజాబ్‌పై ఆర్థిక దిగ్బంధనం విధిస్తామని ప్రకటించింది. “సింధ్ అనేది పాకిస్థాన్ కాదు.. పంజాబీ వలసవాద ఆక్రమణను మేము తిరస్కరిస్తున్నాం. ప్రత్యేక దేశమైన సింధుదేశ్ పునరుద్ధరణే మా లక్ష్యం” అని జర్మనీలో ఉంటున్న జేఎస్ఎంఎం చైర్మన్ షఫీ ముహమ్మద్ బుర్ఫాత్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు.