NTV Telugu Site icon

Visa: ఈసారి రికార్డు స్థాయిలో స్టూడెంట్‌ వీసాలు

Usa

Usa

ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్టూడెంట్‌ వీసా (ఎఫ్‌1) అప్లకేషన్లు అందనున్నాయని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం జనవరి నుంచి మే 14 నాటికే 14,694 స్టూడెంట్‌ వీసాలను జారీ చేసినట్లు వెల్లడించాయి. ఈ సంఖ్య కరోనా ముందు నాటి పరిస్థితులతో పోల్చితే దాదాపు ట్రిపుల్‌ కావటం విశేషం. 2019లో తొలి ఐదు నెలల్లో 5,663 వీసాల దరఖాస్తులే ఆమోదం పొందాయి. ఈ ఇయర్‌లో ఇంకా ఏడు నెలల సమయం ఉంది కాబట్టి విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని భావిస్తున్నారు. మన దేశంలో ఐదు చోట్ల అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాలు ఉన్నాయి.

1. హైదరాబాద్‌ 2. న్యూఢిల్లీ 3. కోల్‌కతా 4. చెన్నై 5. ముంబై. ఈ ఐదింటిలో ఢిల్లీ కాన్సులేటే ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో (8021) వీసాలను జారీ చేసింది. తర్వాతి స్థానాల్లో ముంబై (2,589), హైదరాబాద్‌ (1,947) ఉన్నాయి. గతేడాది కొవిడ్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లు లక్షా 20 వేల ఎఫ్‌1 వీసాలను ప్రాసెస్‌ చేశాయి. ఈసారి సైతం ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్య తగ్గలేదని, రికార్డు లెవల్‌లో వీసా సీజన్లు నిర్వహించాల్సి వస్తుందని అనుకుంటున్నారు.

అందుకే వేల సంఖ్యలో అదనంగా స్టూడెంట్‌ వీసా అపాయింట్‌మెంట్లను ఓపెన్‌ చేశామని, ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్‌ పెంచామని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలోనూ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని కనీసం ఒక్క రోజూ మూసి ఉంచలేదని, పైగా స్టాఫ్‌ని పెంచాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌లోని కొత్త బిల్డింగులోకి కార్యాలయాన్ని మార్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది స్టాఫ్‌ని నియమించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.