భారత్‌పై కక్ష కట్టినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. భారత్ మంచి స్నేహితుడు అంటూనే సుంకాల పేరుతో వాయించేస్తున్నారు. తొలుత 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఆగస్టు 27 నుంచి అమల్లో రానుందని తెలిపారు. అయితే ఈ నిర్ణయం అన్యాయంగా భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక తాజాగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారీ సుంకాలకు భయపడేది లేదని.. అన్నదాతలే ముఖ్యమని.. ఎక్కడా రాజీపడబోమని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: JK: జమ్మూ కాశ్మీర్‌లో విషాదం.. లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు జవాన్లు మృతి
అయితే ట్రంప్ టారిఫ్‌లతో ఆయా రంగాలు భారీగా దెబ్బతినే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సముద్ర ఫుడ్, ఆటో రంగంపై ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగ నష్టాలతో పాటు ఆర్థిక మందగమనం జరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉత్పత్తులు, వస్త్రాలు, ఆభరణాలు, ఆటో విడిభాగాల రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: CPI Narayana: రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు?.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!
ఇదిలా ఉంటే కొత్త టారిఫ్ అమలు కావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఆ సమయంలోపు ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు దఫాల చర్చలు జరిగాయి. మరోసారి చర్చలకు ఆగస్టు 24న అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం భారత్‌కు రానుంది. ఈసారి జరిగే చర్చలు అయినా సత్‌ఫలితాన్ని ఇస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.
మొదటి దెబ్బ తినే రంగాలు..
కొత్త సుంకాలు కారణంగా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వంటి రంగాలు భవిష్యత్‌లో తీవ్ర ప్రభావాన్ని చూడాల్సి వస్తుంది. అధిక ఒత్తిడిని ఎదుర్కోవల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్‌కు మాత్రం ఇబ్బంది కలగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక సముద్ర ఆహార ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే ఛాన్సుంది. సముద్ర ఆహార ఎగుమతుల్లో దాదాపు 40 శాతం అమెరికా వాటా కలిగి ఉంది. దీని విలువ దాదాపు రూ. 60,000 కోట్లు. ఇందులో ఎక్కువ భాగం రొయ్యలే కావడం విశేషం. కనుక దీనిపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇక ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాకు ఎగుమతి చేసే రూ.61,000 కోట్ల విలువైన ఆటో విడిభాగాల్లో దాదాపు సగభాగాన్ని ప్రభావితం చేయనుంది. వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు, భూమికి సంబంధించిన యంత్రాల భాగాలు 50 శాతం సుంకాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. భారతీయ ఆటో విడిభాగాలకు అమెరికా అగ్రస్థానంలో ఉంది. ట్రంప్ తాజా ప్రకటనతో భారీగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాలపై కూడా ప్రభావం కనిపించనుంది. ఈ పరిణామాలన్నీ ఆర్థిక మందగమనానికి దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈనెల అమెరికా బృందం.. భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఏమైనా మార్పులు కనిపిస్తాయేమో చూడాలి.