Site icon NTV Telugu

Afghanistan: మహిళలకు తాలిబన్లు షాక్.. ఇది మహా దారుణం

Talibans Shock To Women Emp

Talibans Shock To Women Emp

Taliban Government Gives Shock To Women Officials: గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళల హక్కుల్ని కాలరాస్తూ వస్తున్నారు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తూ.. పురుషాధిక్య విధానాల్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశారు. మహిళా ఉద్యోగులపై కొరడా ఝుళపించారు. వారిని ఆఫీసుకు రావొద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా బంధువుల్లోని మగాళ్లని పంపాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయాన్ని ఓ మహిళా ఉద్యోగి వెల్లడించింది.

‘‘నాకు రీసెంట్‌గా తాలిబన్ అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆఫీస్‌లో పని భారం పెరుగుతోంది. అంత పని మీరు చేయలేరు కాబట్టి, మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపండి’ అని చెప్పారు’’ ఆ మహిళ తెలిపింది. అంతేకాదు.. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి తమ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, తన పదవిని సైతం తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ. 60 వేలు ఉన్న తన జీతాన్ని ఏకంగా రూ. 12 వేలుకి తగ్గించారని, ఇదేంటని ప్రశ్నిస్తే పై అధికారి దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది. ఇచ్చిన జీతంతో పని చేస్తే ఉండమని, లేకపోతే వెళ్లిపోవచ్చని తనని బెదిరించారంది. 15 ఏళ్లుగా తాను ఆర్థిక శాఖలో పని చేస్తున్నానని, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశానని, కానీ తన చదువుకు తగ్గ హోదా దక్కట్లేదని ఆ మహిళా ఉద్యోగి మొరపెట్టుకుంది.

కాగా.. మహిళలపై తాలిబన్లు ప్రదర్శించిన తీరుని అంతర్జాతీయ సమాజం ఇదివరకే తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై విధించిన ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్‌ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ సిమా బాహౌస్ అంచనా వేశారు. ఆఫ్గాన్ తిరిగి పేదరికంలోకి వెళ్లిపోయిందని.. ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version