Nepal GenZ Protests: నేపాల్ దేశంలో మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో యువత నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ ఆందోళనల్లో సుమారు 20 మందికి పైగా మరణించగా, మరో 300 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి సర్కార్ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ‘జనరేషన్ జెడ్’ నిరసనలు జరగడంతో దరిమిలా హోంశాఖ మంత్రి రమేష్ లేఖక్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇక, ఈ ఆందోళనలపై స్పందించిన ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ హింసకు అవాంఛనీయ శక్తులే కారణమన్నారు.
Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్
అయితే, నేపాల్ రాజకీయ వర్గాల్లో సుడాన్ గురుంగ్ పేరు పెద్దగా తెలియదు. గతంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో పని చేసేవాడు. జీవితం మొత్తం పార్టీల చుట్టూ తిరిగేది. సరిగ్గా పదేళ్ల కిందట నేపాల్‌లో సంభవించిన భూకంపంలో అతడి బిడ్డ చనిపోవడంతో అతడి జీవితం మొత్తం మారిపోయింది. ఆ తర్వాత సుడాన్ సామాజిక కార్యక్రమాల వైపు అడుగులు వేశాడు. ఈ సందర్భంగా హమీ నేపాల్ పేరుతో స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు. ఆ సంస్థ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండేవాడు. ఇక, ఈ నెల 4వ తేదీన నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేదం విధించింది. దీంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడాన్ని నిరసిస్తూ.. అయోమయంలో ఉన్న ఆ దేశ యువతకు సుడాన్ గురుంగ్ ఓ మార్గాన్ని చూపించాడు.
Read Also: Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా?
ఇక, హింసకు ఏ మాత్రం తావులేకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా సుడాన్ గురుంగ్ ప్రణాళికలు రూపొందించాడు. శాంతియుతంగా నిరసన తెలియజేశాడు. విద్యార్థులంతా స్కూల్ యూనిఫామ్‌లో చేతిలో పుస్తకాలతో పార్లమెంట్ దగ్గరకు తరలిరావాలంటూ ఆయన ఇచ్చిన ఒక్క పిలుపు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. అయితే, గురుంగ్ పిలుపుతో వేలాది మంది యువకులు వీధుల్లోకి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ బయట భారీ ర్యాలీ నిర్వహించారు. సోషల్ మీడియాపై నేపాల్ సర్కార్ విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్, లైవ్ రౌండ్లను కూడా ఉపయోగించారు. ఇక, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో.. చివరకు నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మరి సుడాన్ గురుంగ్ సైలెంట్‌గా ఉంటాడా? నేపాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.