చారిత్రకంగా చూస్తే శ్రీలంక పేరు ప్రస్తావన రామాయణం, మహాభారతంలలోనూ ఉంది. అయితే ప్రస్తుతం ఆ దేశం పరిస్థితికి కారణం ఎవరని పరిశీలిస్తే మహాభారతంలో పేర్కొన్న దుష్ట చతుష్టయం లాంటి ‘ఆ నలుగురు’ కనిపిస్తారు. ఏపీలో నిన్నే ముగిసిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో కూడా దుష్టచతుష్టయం అనే అంశంపై నేతలు విరివిగా ప్రసంగించటం గమనార్హం. అదే సమయంలో అటు శ్రీలంక ప్రజలు తమ దేశ అధ్యక్షుడి నివాసాన్ని ఆక్రమించారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అప్పటికే పరారయ్యారు. పాలకుడంటే ప్రజలను కాపాడేవాడై ఉండాలి. పారిపోయేంత పిరికివాడు కాకూడదు.
రష్యా భీకర యుద్ధాన్ని గుండె ధైర్యంతో ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చూస్తే తెలుస్తుంది. దేశ అధ్యక్షుడంటే ఎలా ఉండాలో. కానీ గొటబాయ పరారీ వార్తలు వింటే నవ్వొస్తుంది. ఈ పరిణామంతో మొత్తం శ్రీలంక పరువుపోయింది. నవ్వులపాలైంది. భారతంలో శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు చెడ్డ పనులు చేసేవారు కాబట్టి ఆ నలుగురిని దుష్ట చతుష్టయం అనేవారు. శ్రీలంకలో అయితే రాజపక్స సోదరులను ఇలా అభివర్ణించొచ్చు. రాజపక్స సోదరులు మొత్తం నలుగురు.. 1. చమల్ 2. మహింద 3. గొటబాయి 4. బసిల్.
వీళ్లు శ్రీలంకను 20 ఏళ్లుగా ఇష్టారీతిన పాలించటంవల్లే ఇవాళ ఆ దేశానికి ఈ దుస్థితి వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నలుగురిలో ఒకరు దేశ అధ్యక్షుడిగా, మరొకరు ప్రధానమంత్రిగా, ఇంకో ఇద్దరు మంత్రులుగా, వాళ్ల కొడుకులిద్దరు సైతం మినిస్టర్లుగా, మరో వ్యక్తి ప్రధాని స్టాఫ్‌కి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. కాబట్టి ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా వాళ్లకు తెలియకుండా ఉండేది కాదు. ముఖ్య శాఖలన్నీ ఆ కుటుంబం గుప్పట్లోనే ఉండేవి. కుటుంబ పాలన కారణంగా కుంభకోణాలు బయటికి వచ్చేవి కాదు. దేశ సంపద విదేశాలకు తరలినా మూడో కంటోడికి తెలిసేది కాదు.
ఎవరైనా ‘ఇదేంటి’ అని అడిగితే పాపం. అడ్రస్ లేకుండా చేసేవారు. సైన్యం సైతం ఈ సోదరుల చెప్పుచేతల్లోనే ఉండేది. దీంతో రాజపక్స బ్రదర్స్ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా ఉండేందుకు ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. ఇబ్బడిముబ్బడిగా డబ్బు పంచారు. ఆర్థిక వ్యవస్థపై పట్టుతప్పింది. సాగుపై ముందుచూపు లోపించింది. ఎరువుల దిగుమతిని నిలిపేయటంతో వ్యవసాయ దిగుబడులు తగ్గి ఆహార కొరత ఏర్పడింది. దీనికితోడు చైనాతో ఫ్రెండ్‌షిప్, కరోనా వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. ఒక్కో రంగం కుదేలవటం ప్రారంభించింది.
పాలకులు అభివృద్ధి కార్యక్రమాల పైన కాకుండా అప్పుల పైన ఆధారపడ్డారు. వాటిని తిరిగి చెల్లించలేక చేతులెత్తేశారు. రూపాయి విలువ దారుణాతిదారుణంగా పడిపోయింది. ఒక్క డాలర్ కొనాలంటే ఏకంగా 363 రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో జనం తిరగబడటంతో ఆ నలుగురు అన్నదమ్ములు కనిపించకుండా పోవటం, పదవులకు రాజీనామా చేయటం వంటి నాటకాలకు తెర తీశారు. అతి తక్కువ(2.2 కోట్ల మంది) జనాభా ఉన్న ఈ అందమైన దేశం ఇవాళ రోడ్డున పడింది. ఆ నలుగురు శ్రీలంకను అలా ముంచేశారు. ఒడ్డున పడటానికి ఎన్నేళ్లు పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.