Site icon NTV Telugu

Srilanka Economic Crisis: మళ్లీ స్వదేశానికి గొటబాయ రాజపక్స..

Gotabaya Rajapaks

Gotabaya Rajapaks

Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

కేబినెట్ అధికార ప్రతినిధి రందుల గుణవర్థన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అజ్ఞాతంలో లేరని.. ఆయన తిరిగి శ్రీలంకకు వస్తారని వ్యాఖ్యానించారు. అయితే గొటబాయ రాజపక్స తిరిగి వచ్చే అవకాశం గురించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. తీవ్ర నిరసన, ఆందోళన మధ్య అధ్యక్ష భవనం నుంచి పారిపోయిన గొటబాయ రాజపక్స.. జూలై 14న ప్రైవేట్ విజిట్ కోసం సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రభుత్వం రాజపక్సకు 14 రోజుల స్వల్పకాలిక పాస్ మంజూరు చేసింది. సింగపూర్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గొటబాయ రాజపక్స తమను ఎలాంటి ఆశ్రయం కోరలేదని.. ఎటువంటి ఆశ్రయం ఇవ్వడం లేదని తెలిపింది.

Read Also: Electricity bill: ఓ ఇంటికి రూ.3,419 కోట్ల కరెంట్ బిల్లు.. ఆస్పత్రి పాలైన యజమాని

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్టుకు చెందిన న్యాయవాదులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన రాజపక్సను వెంటనే అరెస్ట్ చేయాలని సింగపూర్ అటార్నీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కూడా గుణవర్థన స్పందించారు. అదుపులోకి తీసుకునే పరిస్థితి ఏర్పడితే.. సింగపూర్ ప్రభుత్వం మాజీ అధ్యక్షుడికి ఎలాంటి హాని కలుగకుండా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.

మహిందా రాజపక్స 2005 నుంచి 2014 వరకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రక్షణ కార్యదర్శిగా పనిచేసిన గొటబాయ రాజపక్స, శ్రీలంకలో ఎల్టీటీఈని దారుణంగా అణచివేశాడు. దీంతో అతనికి యుద్ధవీరుడనే బిరుదు కూడా వచ్చింది. అయితే ఈ సమయంలో తమిళులపై అనేక మానవహక్కుల ఉల్లంఘన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2019లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న గొటబాయ రాజపక్స.. దేశాధినేత హోదాలో విచారణ నుంచి మినహాయింపు పొందాడు. తాజాగా ఆయన పదవికి రాజీనామా చేయడంతో అతడిని విచారించే అవకాశం ఏర్పడింది.

Exit mobile version