Site icon NTV Telugu

Srilanka Crisis: ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు రెండు వారాల పాటు మూసివేత

Srilanka

Srilanka

శ్రీలంక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రభుత్వం మారినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ జనాలు తీవ్ర ఇంధన కొరత, నిత్యావసరాల కొరతను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో దేశంలో ట్రాన్స్ పోర్ట్ , విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.

ఇదిలా ఉంటే ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు డాలర్లు లేకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది. శ్రీలంక అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డిజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో సోమవారం నుంచి అన్ని విభాగాలు, ప్రభుత్వ సంస్థలు తమ సేవలను తక్కువ చేసుకోవాలని అక్కడి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో ఉద్యోగులు తక్కువ సంఖ్యలోనే హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.

1948లో బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం పొందిన శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరగని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో  ఆహారం, ఇంధనం, ఎరువులు, మందులు ఇలా అన్నింటిలో తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. శ్రీలంకలో ప్రతీ ఐదుగురిలో నలుగురు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధ్యక్షుడు గోటబయ రాజపక్స, కొత్తగా రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమించడంతో పాటు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. అయినా ఇప్పటికిప్పుడు శ్రీలంక పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. ఇక ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం శ్రీలంక ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే భారత్ క్రెడిట్ లైన్ కింద మందులు, ఇంధనం, ఎరువులు, ఆహారాన్ని శ్రీలంకకు అందిస్తోంది.  ఇటీవల భారత్ చేస్తున్న సాయాన్ని చైనా కూడా పొగిడింది. శ్రీలంకలో పరిస్థితి ఇలా కావడానికి గోటబయ కుటుంబీకులే కారణం అని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.

 

Exit mobile version