తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది.
దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం కర్ఫ్యూ ఎత్తివేయనున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కర్ఫ్యూ విధించినట్టు తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే దేశంలో అత్యయిక పరిస్థితి విధించారు. శనివారం మరో గెజిట్ ను విడుదల చేశారు శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే. రేపు సాయంత్రం ఆరు వరకు కర్య్పూ పొడిగించారు.
రోడ్డుమీద ,పార్క్ లు,బీచ్, రైల్వే స్టేషన్ సహా ఇతర ప్రాంతాలలో ప్రజలు ఎవరు కూడా ఉండకూడదు.. తిరగకూడదంటూ గెజిట్ విడుదల చేశారు. ఎవరు గెజిట్ ను అతిక్రమించిన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వ అసమర్థ విధానాలే శ్రీలంక దుస్థితికి కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆంక్షల్లో భాగంగా సోషల్ మీడియాకు చెందిన Facebook, Facebook Messenger, Twitter, WhatsApp, YouTube, Snapchat, Twitter Periscope, Google Video, TikTok , Viber, Telegram , Instagram సహా 12 వాటిపై ఆంక్షలు విధించారు. అత్యవసర పరిస్థితి నేపథ్యంలో వదంతులు వ్యాపించకుండా చర్యలు చేపట్టింది.
