శ్రీలంక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. నిత్యావసరాల కోసం కొనేందుకు జనాల దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా మొత్తం పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం శ్రీలంక విదేశాల ఇచ్చే సాయంపైనే ఆధారపడింది. ప్రజల ఆగ్రహావేశాల మధ్య గతంలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో ఆహార సంక్షోభాన్ని హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల శ్రీలంక వ్యవసాయ మంత్రి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వరిని పండించాలని కోరారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు కొనేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బులు లేవు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎరువుల కోసం ఇండియా నుంచి శ్రీలంక 55 మిలియన్ డాలర్ల రుణాన్ని కోరింది. ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా యూరియాను కొనుగోలు చేసేందుకు శ్రీలంకకు 55 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇండియా ఇవ్వడానికి అంగీకరించిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు సత్వర చర్యలు చేపడితే..ఐదారు నెలల్లో ప్రస్తుత వ్యవసాయ కొరతను తీర్చగలమని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు.
రసాయన ఎరువులను దిగుమతులను నిషేధిస్తూ శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తీసుకున్న నిర్ణయం శ్రీలంక ఆహార సంక్షోభానికి కారణం అయింది. దీంతో దేశంలో ఆహార పంటల ఉత్పత్తి గణనీయంగా 50 శాతానికి తగ్గింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. 1945 లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంక ఇటువంటి ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. ఆహారం, ఔషధాల, వంటగ్యాస్, టాయిలెట్ పేపర్, అగ్గిపెట్టె వంటి నిత్యావసరాలకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజల పెట్రోల్, డిజిల్ కోసం గంటల తరబడి క్యూల్లో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.