శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆందోళన బాట పట్టారు. నిరసనకారులు రాజధాని కొలంబోలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహిందా రాజపక్సే అధికారిక నివాసాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న ప్రధానిగా మహిందా రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజపక్సే పూర్వీకులకు సంబంధించిన ఇళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై ఆందోళకారులు దాడి చేశారు.సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ఎంపీల బృందంతో గోటాగోగామాలోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి జరిగింది.గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్నవారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రేమదాసపై నిరసనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. రాజపక్సే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారికి, ప్రభుత్వ వ్యతిరేఖ ఆందోళకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కొలంబోలోని గాలే ఫేస్ గ్రీన్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యతిరేఖ నిరసన వేదికపై శ్రీలంక పొదుజన పెరమున మద్దతుదారులు దాడి చేశారు.
ప్రధాని రాజపక్సెే రాజీనామా చేయవద్దని కోరారు. అనంతరం అక్కడ ఉన్న ఆందోళనకారులతో ఘర్షణ పడి నిరసన ప్రదేశాన్ని ధ్వంసం చేశారు. గాలే ఫేస్ లోని గోటగోగామా వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ మద్దతుదారులు ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుగా నిలవడంతో ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస, జేవీపీ నాయకులు ఎంపీ అనురా కుమార దిసానాయక, కార్మిక సంఘ నేతలు సంఘటన స్థలానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వీరిపై ప్రభుత్వ అనుకూల మద్దతుదారులు దాడికి ప్రయత్నించారు. దీంతో ప్రేమదాస చాలా దూరం పరిగెత్తి, కారెక్కి పారిపోయారు. ప్రతిపక్ష నేత ప్రభుత్వ మద్దతు, వ్యతిరేఖ వర్గాల నుంచి దాడిని ఎదుర్కొన్నారు. రాజపక్సే సర్కార్ ను గద్దె దించడంలో విఫలమయ్యారని ప్రజలు ప్రేమదాసపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 16 మంది గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని కొలంబో లోని నేషనల్ హాస్పిటల్ కు తరలించారు.
Maoists Letter: ఆయుధాలు వదిలి రావాలన్న పిలుపు… మావోయిస్టుల జవాబు