Bangladesh: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు గేమ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా, లౌకికవాదిగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌ని ఆ పదవి నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి మతోన్మాద సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనలో ఉండగా, అతడి మద్దతుదారులైన ఆర్మీ అధికారులను హౌజ్ అరెస్ట్ చేశారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మద్దతుదారులను టచ్ చేశారంటే, నేరుగా ఆయననే సవాల్ చేసినట్లు.
ఈ పరిణామాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్‌లో పెద్దగా ఏదో జరగబోతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సైన్యంలోని ఐదుగురు కీలకమైన సీనియర్ అధికారుల్ని ఢాకా కంటోన్మెంట్‌లో నిర్భందించారు. ఇందులో ఇద్దరు బ్రిగేడియర్లు, ఒక కల్నల్, ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ ఉన్నారు. వీరిని వారి అధికారిక నివాసాలకే పరిమితం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగురు అధికారుల గుర్తింపును బహిరంగంగా వెల్లడించలేదు.
Read Also: Mamata Banerjee: “వక్ఫ్ చట్టాన్ని” బెంగాల్‌లో అమలు చేయం, అల్లర్లు దేనికి.?
భారత ఏజెన్సీలు ఐదుగురిని గుర్తించాయి. వారిలో బ్రిగేడియర్ జనరల్ ఎస్ ఎం జకారియా హుస్సేన్ (ఇంజనీర్స్ బ్రిగేడ్), బ్రిగేడియర్ జనరల్ ఇమ్రాన్ హమీద్ (ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్) ఉన్నారు. హమీద్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఏడీసీగా పనిచేశారు. రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) నుండి కల్నల్ అబ్దుల్లా అల్-మోమెన్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) నుండి లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ రిద్వానుల్ ఇస్లాం,తూర్పు బెంగాల్ రెజిమెంట్ నుండి మేజర్ మొహమ్మద్ నోమాన్ అల్ ఫరూక్‌లను నిర్భందించారు. వీరంతా ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి మద్దతుదారులు.
గత రెండు రోజలుగా వీరిపై నిఘాను ఉంచారు. వారి కార్యకలాపాలను పరిమితం చేయడంతో పాటు, విధుల నుంచి వీరిని తొలగించారు. అంతేకాకుండా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) అధికారులపై అభియోగాలు నమోదు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వస్తున్న సమాచారం ప్రకారం, ముందుగా ఆర్మీ చీఫ్ జమాన్ మొదట్లో వీరిని నిర్భంధించేందుకు అనుమతి ఇవ్వలేదని, ఐసీటీ వారిపై తీర్మానాలను సమర్పించిన తర్వాత హౌజ్ అరెస్ట్‌కి అధికారాలు ఇచ్చినట్లు నివేదికలు వెలువడ్డాయి. వీరంతా దేశం వదిలి వెళ్లకుండా కఠినమైన నిఘాలో ఉంచినట్లు తెలుస్తోంది.