Mamata Banerjee: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో పలు ప్రాంతాలో తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో ఆందోళనకారులు దుకాణాలు, వాహనాలే టార్గెట్‌గా నిప్పుపెడుతున్నారు. ముర్షిదాబాద్‌లో రైలుపై రాళ్లదాడి చేశారు. ఈ నేపథ్యంలో, బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయదని ఆమె హామీ ఇచ్చారు.
‘‘ ఈ విషయంపై మేము మా వైఖరిని స్పష్టం చేశాము. మేము ఈ చట్టానికి మద్దతు ఇవ్వము. ఈ చట్టం మన రాష్ట్రంలో అమలు చేయబడదు. మరి అల్లర్లు దేని గురించి..?’’ అని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేసింది. “అన్ని మతాల ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి, దయచేసి ప్రశాంతంగా ఉండండి, సంయమనంతో ఉండండి. మతం పేరుతో ఎటువంటి అన్యాయమైన ప్రవర్తనలో పాల్గొనవద్దు. ప్రతి మానవ జీవితం విలువైనది. రాజకీయాల కోసం అల్లర్లను ప్రేరేపించవద్దు. అల్లర్లను ప్రేరేపించేవారు సమాజానికి హాని కలిగిస్తున్నారు” అని ఆమె అన్నారు.
Read Also: Vaishnavi Chaitanya: పాపం.. వైష్ణవి మీద పడితే ఏం లాభం?
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 15 మంది అధికారులకు గాయాలయ్యాయి. బెంగాల్ టాప్ పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ. శుక్రవారం జరిగిన హింసాత్మక నిరసనలకు పుకార్లు కారణమయ్యాయి, ఇందులో పోలీసు అవుట్‌పోస్టులు, రైల్వే కార్యాలయాలు మరియు దుకాణాలతో సహా అనేక ప్రభుత్వ వాహనాలు, భవనాలు ధ్వంసం చేయబడ్డాయని చెప్పారు.
చట్టాన్ని తమ పార్టీ సమర్థించలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసనకారులకు గుర్తు చేశారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని, కాబట్టి మీకు కావాల్సిన సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని అని ఆమె అన్నారు. నేరస్తులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లాభం కోసం మతాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, వారికి లొంగిపోవద్దని ఆమె అన్నారు.