Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అతిపెద్ద విచారణను ప్రారంభించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్ అభియోగాలు నమోదు చేసింది. గతేడాది, హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకుంది. ప్రస్తుతం, భారత్లోనే ఆశ్రయం పొందుతోంది.
Read Also: Israel: గాజా ప్రజల పైకి ఇజ్రాయిల్ ఓపెన్ ఫైర్..30 మంది మృతి, 115 మందికి గాయాలు..
2024 విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు సమయంలో హింసాత్మక అణచివేత చర్యలలో షేక్ హసీనా ప్రధాన నిందితురాలని, ఈమెతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు బంగ్లా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. హసీనా రాష్ట్ర భద్రతా దళాలు, ఆమె రాజకీయ పార్టీ, అనుబంధ సంస్థలకు ఈ ఉద్యమాన్ని అణచివేయాలని నేరుగా ఆదేశాలు ఇచ్చారని దర్యాప్తు నివేదికలో తేలినట్లు, దీని వల్లే భారీ ప్రాణనష్టం జరిగినట్లు, ఈ హత్యలు ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆదివారం తెలిపారు.
ఈ కేసులో మొత్తం 18 మందిని సాక్షులుగా పేర్కొన్నట్లు ఇస్లాం చెప్పారు. ప్రభుత్వ అధిపతిగా హసీనా అశాంతి సమయంలో భద్రతా దళ కార్యకలాపాలకు కమాండ్ బాధ్యత వహిస్తున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ని పాలిస్తున్న షేక్ హసీనా గతేడాది ఆగస్టులో ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ అణచివేతల వల్ల దాదాపు 1,500 మంది మరణించగా, 25,000 మంది గాయపడ్డారని ఇస్లాం గత నెలలో చెప్పారు.