యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్( యూఏఈ) అధ్యక్షుడిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆల్ నెహ్యాన్ మరణించడంతో కొత్త పాలకుడి ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో కొత్త పాలకుడిగా షేక్ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ను ఎన్నుకుంది ఫెడరల్ సుప్రీం కౌన్సిల్. ఎంబీజెడ్ గా పిలువబడే మహ్మద్ బిన్ జాయెద్ అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఎంబీజెడ్ ఎన్నికైన తర్వాత యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.
నిజానికి యూఏఈ రాజ్యాంగం ప్రకారం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 30 రోజులు గడువు ఉన్నా షేక్ ఖలీఫా మరణించిన తర్వాతి రోజు శనివారమే కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. షేక్ ఖలీఫా అధ్యక్షుడిగా ఉన్నా.. వాస్తవ అధ్యక్షుడిగా మాత్రం మహ్మద్ బిన్ జయాద్ వ్యవహరిస్తున్నారు. షేక్ మహ్మద్ బిన్ జయాద్, చనిపోయిన షేక్ ఖలీఫాకు స్వయానా సోదరుడు. 2004 నుంచి ఆయన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం మహ్మద్ బిన్ దేశానికి మూడో అధ్యక్షుడిగా పనిచేయనున్నారు. నిన్న జరిగిన ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ కు దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ నాయకత్వం వహించగా… యూఏఈ పాలకులంతా హాజరయ్యారు. సమావేశంలో యూఏఈ పాలకులు మహ్మద్ బిన్ జయాద్ అల్ నెహ్యాన్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవిని స్వీకరించిన తర్వాత ఐదేళ్ల పాటు ఆయన అధికారంలో ఉండనున్నారు.
ప్రస్తుతం షెక్ మహ్మద్ బిన్ జాయెద్ యూఏఈ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ గా వ్యహరిస్తున్నారు. 2005 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. యూఏఈ రక్షణ దళాలను అత్యంత శక్తివంతమైన ఫోర్స్ గా తీర్చిదిద్దడంలో మహ్మద్ బిన్ జాయెద్ కీలకంగా వ్యవహరించారు. యూఏఈ సాయుధ దళాలను వ్యూహాత్మకంగా, సామర్థ్యం పరంగా అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దాడు.