Saudi Arabia: ఇస్లామిక్ చట్టాలను కఠినంగా పాటించే సౌదీ అరేబియాలో మద్యపానంపై బ్యాన్ ఉంది. ఆ దేశంలో ఎక్కడా కూడా ఆల్కాహాలు దొరకదు, ఎవరైనా వాటితో పట్టుబడితే నేరంగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా సౌదీలో మొట్టమొదటి సారిగా లిక్కర్ షాప్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం రాజధాని రియాద్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.
కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోడ్‌ని పొందాలని సౌదీ ప్రభుత్వ పత్రాలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. నెలవారీ కోటాపై కూడా పరిమితి ఉండనన్నట్లు సమాచారం. ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధించబడుతుంది. అయితే, ఇటీవల సౌదీ కూడా పర్యాటకంగా వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పలు చారిత్రత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Read Also: Tata Motors: టియాగో, టిగోర్ CNG AMT బుకింగ్స్ ప్రారంభం..
చమురు ఎక్కువగా దొరికే సౌదీ, యూఏఈ లాగే పర్యాటకంలో దూసుకెళ్లాలని భావిస్తోంది. విజన్ 2030 పేరులో ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రారంభించనున్న లిక్కర్ షాప్ రియాద్‌లోని డిప్లోమాటిక్ క్వార్టర్స్‌లో ఉంటుంది. ఇక్కడే రాయబార కార్యాలయాలు, దౌత్యవేత్తలు నివసిస్తుంటారు. ఇదిలా ఉంటే సౌదీలో ఉంటున్న ముస్లిమేతర ప్రవాసులకు అనుమతి ఉంటుందా..? లేదా..? అనే దానిపై స్పష్టత లేదు. సౌదీలో మిలియన్ల సంఖ్యలో ప్రవాసులు ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్, పాకిస్తాన్ వంటి ఆసియా దేశాలతో పాటు ఈజిప్టు నుంచి వచ్చిన ముస్లిం కార్మికులే అధికం.
సౌదీలో మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటారు. అక్కడి చట్టాల్లో దీనికి వందలాది కొరడా దెబ్బలతో పాటు జరిమానా, జైలు శిక్ష, బహిష్కరణ వంటి శిక్షలు ఉన్నాయి. పలు సందర్భాల్లో విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా దేశ బహిష్కరణ ఎదుర్కొన్నారు. సౌదీలో డిప్లామాటిక్ మార్గాల్లో, బ్లాక్ మార్కెట్‌లో మద్యం అందుబాటులో ఉంటుంది.