NTV Telugu Site icon

Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్‌ని చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్‌ ఖతం.. లాహోర్‌లో కాల్చిచంపిన “గుర్తుతెలియని వ్యక్తులు”..

Sarabjeet

Sarabjeet

Sarabjit Singh: భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్‌ని పాకిస్తాన్ జైలులో చంపిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి షూట్ చేయడంతో అమీర్ హతమయ్యాడు. జైల్లో సరబ్‌జీత్ సింగ్‌పై దాడి చేసి చంపినందుకు అమీర్ సర్ఫరాజ్‌పై కేసు నమోదైంది. అయితే, ఇతనికి వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవడంతో 2018లో పాకిస్తాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Read Also: Rajnath Singh: ‘‘చేపలు, ఏనుగులు, గుర్రాలను తినండి ఎందుకు చూపించడం.?’’ తేజస్వీపై రాజ్‌నాథ్ ఆగ్రహం..

పంజాబ్ నివాసి అయిన సరబ్‌జీత్ సింగ్ అనుకోకుండా పాకిస్తాన్ సరిహద్దు దాటడంతో ఇతడిపై గూఢచర్యం ముద్ర వేసి పాకిస్తాన్ 1990లో అరెస్ట్ చేసింది. అయితే, అతడి అరెస్టును భారత్ తీవ్రంగా ఖండించింది. అతని సోదరితో పాటు కుటుంబం అతడిని విడిచిపెట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. పాకిస్తాన్ జైలులో 23 ఏళ్లు గడిపిన సరబ్‌జీత్ మే 2013లో 49 ఏళ్ల వయసులో లాహోర్ ఆస్పత్రిలో మరణించారు.

భారతదేశంలో పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్జీత్‌పై దారుణంగా దాడి చేశారు. అతను 23 ఏళ్లు లాహోర్ లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నాడు. ఖైదీలు ఇటుకలతో సరబ్జీత్‌పై దాడి చేయడంతో అతని మెదడులో తీవ్రగాయాలై, చికిత్స పొందుతూ జిన్నా ఆస్పత్రిలో మరణించాడు. అతడిని ఇండియా తీసుకువచ్చేందుకు అతని అక్క దల్బీర్ సింగ్ అవిశ్రాంతంగా పోరాడింది. ఆమె పోరాటంపై బాలీవుడ్‌లో సినిమా కూడా వచ్చింది. ఐశ్వర్యారాయ్, రణదీప్ హుడా నటించారు.