Site icon NTV Telugu

Russia-India: ఉగాది వేళ భారత్‌కు శుభపరిణామం.. నడిసంద్రంలో చైనాకు రష్యా ట్యాంకర్ షాక్

Russiaindia

Russiaindia

పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. కానీ భారత్ మాత్రం సేఫ్ జోన్‌లో ఉంది. ఆయా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు తీపికబురు అందింది. చైనాకు వెళ్తున్న రష్యన్ ఆయిల్ ట్యాంకర్ నడిసంద్రంలో డ్రాగన్‌కు ఝలక్ ఇచ్చి భారతదేశం వైపు యూ-టర్న్ తీసుకుంది. దీంతో పెద్ద ఎత్తున భారత్‌కు చమురు చేరుకోనుంది. ఉగాది వేళ భారత్‌కు ఇది శుభపరిణామంగా చెప్పొచ్చు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత్ ట్యాంకర్లకు గ్రీన్‌సిగ్నల్స్ లభించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్‌కు చేరుకునేలా ఇరాన్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తాజాగా రష్యన్ ట్యాంకర్ కూడా భారత్‌కు వచ్చేయనుంది. దీంతో చమురు కష్టాలు తీరనున్నాయి.

షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. రష్యాకు చెందిన ఆక్వా టైటాన్‌ ట్యాంకర్ చైనాకు వెళ్తుండగా ఆగ్నేయాసియా జలాల్లో అకస్మాత్తుగా దిశ మార్చుకుంది. తొలుత చైనాలోని రిజావో ఓడరేవుకు వెళ్లేందుకు గమ్యస్థానం ఏర్పాటు చేసుకోగా.. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని భారత్ వైపు మలుచుకుంది. ఈ నౌక మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది.

ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తలెత్తకుండా రష్యా చమురు కొనుగోలు చేసుకునేందుకు భారతదేశానికి అమెరికా 30 రోజులు మినహాయింపు ఇచ్చినట్లుగా తెలిపింది. అయితే ఈ ప్రకటనను భారత్ ఖండించింది. రష్యా చమురు కొనడానికి తాము ఏ దేశ అనుమతిపైనా ఆధారపడలేదని భారతదేశం తేల్చి చెప్పింది.

Exit mobile version