ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దురాక్రమణ పరాకాష్టకు చేరుతోంది. పుతిన్ అరాచకానికి సైనికులతో పాటు సామాన్య పౌరులు బలైపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హతమార్చేందుకు రెక్కీల మీద రెక్కీలు సాగుతున్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. సైనిక చర్య మొదలైన వారం రోజుల్లోనే ఆయన హత్యకు మూడుసార్లు యత్నించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతోన్న భద్రతా దళాలు రష్యా కుట్రను భగ్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని కడతేర్చేందుకు వందలాది మంది ప్రైవేటు సైన్యం కీవ్‌లో ప్రవేశించిందని వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Read Also: Ukraine Russia War: రష్యా వ్యూహాత్మక దాడులు..
ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ను చంపేందుకు క్రెమ్లిన్ మద్దతున్న వాగ్నర్ గ్రూప్… చెచెన్ స్పెషల్ ఫోర్స్ పలుమార్లు ప్రయత్నించినట్లు లండన్‌లోని ఓ అంతర్జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. అంతేకాదు వాగ్నర్ గ్రూపులో కొందరు హతమైనట్లు వెల్లడించింది. అటు చెచెన్ ప్రత్యేక దళాలు సైతం జెలెన్‌స్కీని మట్టుబెట్టేందుకు విఫలయత్నం చేసినట్లు ఉక్రెయిన్ జాతీయభద్రతా, రక్షణ మండలి కార్యదర్శి ఒలెక్సీయ్ డానివోల్ చెప్పారు. ఇంటెలిజెన్స్ అప్రమత్తతో అధ్యక్షుడిపై దాడి కుట్రను భగ్నం చేశామని… యుద్ధాన్ని వ్యతిరేకించే రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ లోని కొన్ని వర్గాలు తమకు ముందే సమాచారం లీక్ చేశాయన్నారు. మరోవైపు, ఉక్రెయిన్‌ను వదిలి జెలెన్‌స్కీ పారిపోయారంటూ రష్యన్ మీడియాలో కొన్ని కథనాలు ప్రసారం అవుతున్నాయి.. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఉక్రెయిన్ స్పందించలేదు. గతంలోనూ ఇలాంటి ప్రచారాలు చేసింది రష్యా.