Russian Leader Daughter Killed By Car Bomb: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, కీలక నేత అయి అలెగ్జాండర్ డుగిన్ కుమార్తెను దారుణంగా హత్య చేశారు. కారులో బాంబ్ పెట్టి హతమర్చారు. అయితే మెయిన్ టార్గెట్ అలెగ్జాండరే అని తెలుస్తోంది. అలెగ్జాండర్ కుమార్తె డారియా దుగినా కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో మాస్కోకు వెలుపల 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోల్షి వైజ్యోమీ గ్రామ సమీపంలో ఆమె టయోటా ల్యాండ్ క్రూజర్ కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి డారియా దుగినా మరణించారు. కారులో బాంబు ఉంచి పేల్చేశారని రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. చివరి నిమిషంలో అలెగ్జాండర్ కు బదులుగా ఆయన కుమార్తె డారియా దుగినా కారులో ప్రయాణించినట్లు తెలుస్తోంది.
కారులో బాంబు పేలుడు ధాటికి డారియా అక్కడిక్కడే మరణించారు. రష్యాలో ప్రధాన నేరాలను విచారించే అత్యున్నత కమిటీ ఈ హత్యపై దర్యాప్తు చేస్తోంది. అలెగ్జాండర్ డుగిన్, అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. పుతిన్ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తుల్లో డుగిన్ ఒకరు. డుగిన్ ను కొన్ని సార్లు ‘‘ పుతిన్స్ రాస్‌పుటిన్’’, ‘‘పుతిన్ మెదడు’’గా వ్యవహరిస్తుంటారు.
Read Also: Gold Theft: వాకింగ్ చేస్తున్న వ్యాపారి.. సీన్ కట్‌చేస్తే.. ఆసుపత్రిలో..! ఏమైందంటే..
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడానికి పుతిన్ ను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అలెగ్జాండర్ డుగిన్ ఉన్నారు. డుగిన్ రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలను ఏకీకరణ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఉక్రెయిన్ పై మాస్కో ఆపరేషన్కు అలెగ్జాండర్ డుగిన్ మద్దతు తెలిపారు. రష్యా, క్రిమియాను స్వాధీనం చేసుకున్న తరువాత అలెగ్జాండర్ డుగిన్ పై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఆయన కుమార్తె డారియా దుగినా సంప్రదాయవాది. ఈమె ఉక్రెయిన్ పై రాసిన ఓ వ్యాసంతో పాశ్చత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఇది ఉక్రెయిన్ చేసిన దాడిగా పలువురు రష్యా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.